Sunday, February 8, 2009

సౌందర్య లహరి - స్ఫూర్తి -1


శంకర భగవత్పాదుల సౌందర్య లహరి శ్లోకానికి స్ఫూర్తి పొంది నేను రాసిన తెలుగు పద్యాన్ని మన్నించగలరు (అనువాదం కాదు సుమా...)

రాముడూ స్ఫూర్తి అని నేను రాస్తున్న టపాల లో మధ్య ఇది రాయటానికి వెనుక రెండు కారణాలు ఉన్నాయి.

(1) తెలుగు తేజం రాఘవ గారి బ్లాగ్పఠనం తో నాకు నిన్న రాత్రి జాగరణ అయ్యింది. ఆయన రాసిన పద్యాలు రామానుభూతి కై, రామ దర్శనార్థమై పరితపించే 'నాదు జిహ్వకున్ పానకమయ్యె '. వారి భక్తి, వాక్పటిమ నాలో స్ఫూర్తి కలిగించాయి. వారికి అనేకానేక నమస్సులు. ఇక్కడ ప్రస్తావిస్తె పులిని జూసి నక్క వాత పెట్టుకున్న చందం గా ఉంటుందేమో ... కానీ .. ఆయన అంధ్రీ కరణ పద్యాలు చదివి ఉత్సాహం ఉరకలెత్తింది. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు కదా.. అందుకే దూకా..(తప్పో ఒప్పో నేర్చుకోవచ్చు కదా చిన్నవారైనా విద్యాధికులైన వారి వంటి వారి నుండి అని...)

(2) నా మిత్రులు నీ టపాల్లో రాముడు మంచి బాలుడు అనే కోవకెనా ఇంకేమైనా కూడా ఉంటయా? పైగా కృష్ణుడి బొమ్మ పెట్టావు రాముడి గురించి రాశావు .. అని భీష్మ ఏకాదశి నాడు అడిగినప్పుడు నేను ఎప్పటికీ నా హృదయ రాముడు రాముడే.. స్మిత వక్త్రో మితా భాషీ పూర్వ భాషీ కదా..(I feel, I am some how obsessed with Rama) అందుకే నా దృష్తి లో రాముడు ఎప్పటికీ మంచి బాలుడే. కృష్ణుడు కొంటె కోణంగె. ఇద్దరూ నా హృదయ నాథులే అయినా రాముడంటే ఒక సాఫ్ట్ కార్నర్.

అయినా ఆ అపవాదు మాత్రం ఎందుకని కొంటె కృష్ణుడి గురించి కలిగిన ఒక భావం రాశా. (ఇది చిరంజీవి శ్రీమాన్ రాఘవ గారికి ఆశీస్సులు గా భావించి రాస్తున్నావారి అమ్మ పద్యాలకి ముగ్ఢుణ్ణై ... 22 ఏళ్ళ చిరుత ప్రాయము వారు అనుకుంటూ...)

నా బ్లాగు పేరు లోనే సూచించినట్టుగా నేను ఈ పద్యాల 'రాత ' బడిలో ఎల్.కే.జీ. చదువుతున్న చిన్న పిల్ల వాడిని. ఎప్పటి లాగా నే యతి నియమోల్లంఘన ను పెద్ద మనసుతో క్షమించెయ్యండి. మంచి పద్యాలు కొంచం కొంచం గా ప్రత్నించి తొందరలో నే నేర్చుకుని, రాసే ప్రయత్నం చేస్తా..


సౌందర్య లహరి శ్లోకం.

शरज्ज्योत्स्ना शुध्धाम शासियुत जटा जूट मकुटाम

वरत्त्रसत्त्राण स्फटिका घटिका पुस्तक कराम

सक्क्रुन्नात्वा नत्वा कथमिव सतां सन्निदधते

मधु क्षीर द्राक्षा मधुरि मधुरीणा: परिणत:


సౌందర్య లహరి శ్లోకం.

శిర మకుటంబు చంద్రుడు శరదృతు వెన్నెల దేహకాంతి ! శ్రీ

కరముల పుస్తకంబు వరదాభయముల్ స్పటికాక్ష మాలయున్

వర ధరియించి మ్రొక్కిడిన వారికి పాలును, ద్రాక్ష, తేనియున్

వరముగ వాక్కు నందు నిడు తల్లి కృపన్ గను నెల్లవేళలన్ !!


ఇక కొంటె కృష్ణుడి విషయానికొస్తే..

గోకులం లో పిల్లల అల్లరి ఎక్కువయ్యింది ట. ఆందరూ చాడీలు చెబుతూంటె ఇక లాభం లెదు అని తల్లి అనుకుందిట.


ఫద్యం.

బాలుని పట్టి తెచ్చి నొక రోటికి గట్టె యశోద ! బాలుడున్

కాలు కదల్చనెంచి నొక వేలును చూపగ తల్లడిల్లుచున్

మాలిమి తోడ బల్కె "మము గాచుటకున్ గిరి నెత్తినట్టి నీ

కేలుకు రక్ష శ్రీ హర"ని, అట్టి యశొదయె మీకు రక్షగన్ !!


అల్లరి పిల్ల వాడు చిటికిన వేలు చూపిస్తే ముడి విప్పేస్తుంది కదా అని తప్పించుకో జూచాట్ట. ఆవిడకి మాత్రం ఎంత పెద్ద కొండని మోసేసాదో నా బంగారు కొండ, ఎంత కష్టమయ్యిందో అని ఎప్పుడూ బుగ్గలు ఒత్తుకుంటూ అనుకుంటూంటుంది ట. అల్లాంటిది పిల్లవాడు వేలు చూపెట్టగానే.. ఇక పరుగు పరుగున వచ్చి కౌగలించుకుని "అయ్యొ వెర్రి నాగన్నా... నీకు నెప్పి ఇంకా తగ్గలేదా నాయనా ' అంటుందిట. అప్పటి దాకా వాడు చేసిన అల్లరి అంతా హుష్ కాకి.....అంతటి ప్రేమాప్యాయతలు ఒలకబోసే తల్లి యశోద మీకు రక్ష యగుగాక. !

చిన్న పాటి వివరణ.

పిల్ల వాడిని రోటికి కట్టింది చిన్నప్పుడూ, గోవర్ధన గిరి నెత్తింది కొంచం పెద్దైన తర్వాత కదా అని ఎవరికైనా సందేహం కలగచ్చు. పోతన గారు కృష్ణుణ్ణి యశోద ఒక్క సారి మాత్రమే కట్టింది అని చెప్పలేదు కదా.. కృష్ణుడు తర్వాత ఎప్పుడైన అల్లరి చేసి ఉంటె చెవి మెలేసె కూడా ఉండచ్చు.

9 comments:

Anonymous said...

మీ బ్లాగు, పద్యాలు, టపాలు అన్నీ చాలా బాగున్నాయి.
రాఘవగారి ప్రతిభని ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యానందాలు పొందినవాళ్ళలో నేనూ ఒకణ్ణి. మీరు కూడా ఆశీస్సులు అందజేయడం చాలా సముచితంగా ఉంది.

విరజాజి said...

పొద్దున్నే అమ్మవారి దర్శనం కలిగించారు, స్మరణం చేయించారు - ధన్యోస్మి!
మనస్సు పరి పరి విధాల పోతూ ఉంటే, లాభం లేదని అమ్మ పాదాలు ఆశ్రయించాను - నేడే శ్రీ దేవీ ఖడ్గమాలా స్తొత్ర పారాయణ మొదలు పెట్టాను. ఒక మండలం రోజులు చేద్దామని .. ! పొద్దున్నే మీ బ్లాగు పుట తెఱవగానే శ్రీ మాత ప్రత్యక్షం అయ్యింది...! అమ్మ దయ ఉంటే అన్నీ సాధ్యమేనండీ.... ఇలా మంచి పద్యాలు రాస్తూ ముందుకు సాగిపొండి!

Sanath Sripathi said...

మురళి గారు, విరజాజి గారూ నెనర్లు. మీ ప్రోత్సాహకర వ్యాఖ్య (comments) కు కృతజ్ఞతలు.

రాఘవ said...

యతిని వదిలివేస్తే ఒక చిన్న దోషానికి మినహాయించి (శరదృతువులో అన్నీ లఘువులే) సౌందర్యలహరిలోని శ్లోకపు స్ఫూర్తితో వ్రాసిన పద్యం బావుంది.

తరువాత కృష్ణలీలలు నిజంగా కర్ణామృతమే. ఎంత విన్నా ఎన్ని రకాలుగా వర్ణించినా తనివితీరదు.

Aditya Madhav Nayani said...

శ్రీపతి గారు..
కృష్ణలీలల్ని చాలా బాగా వర్ణించారు..
అభినందనలు..

Sanath Sripathi said...

రాఘవ గారు,

న.జ.భ.జ.జ.జ.ర. లో రాశా
శిరమ.కుటంబు.చంద్రుడు.శరదృ.తువెన్నె.లనీల.కాంతిశ్రీ అని.

మీ సూచన ను సరిగా అర్ధం చేసుకోలేదేమో నేను. 'శరదృ' లో అన్నీ లఘువులే ఉన్నాయి అనా లేక 'శరదృ' లో అన్నీ లఘువులే ఉండాలి అనా? తప్పైతే సరిజేయగలరు. 'శరదృ' లో ఋకారం తో 'ర ' కు గురువు రాదు అనా?

అయితే మీరన్న తర్వాత చూసుకున్నప్పుడు శరదృతు లో తప్పు కనిపించ లేదు కానీ 'శ్రీ' లో కనిపించింది. గణం చెడింది. బహుశా 'ఆ' అని వాడచ్చేమో.

సనత్ కుమార్.

Sanath Sripathi said...

మాధవ్ గారు, ధన్యవాదాలు.

మా స్నేహితుడొకరు బ్లాగు చూసిన తర్వాత అన్నారు..రెండు పద్యాలనూ కలపి ఇవ్వకుండా వేర్వేరు గా ఇచ్చి ఉంటే కృష్ణుడికే ఎక్కువ ఓట్లు పడేవేమో. అప్పుడు ఇక ట్రయాంగులర్ సిరీస్ అయ్యేది అని... (రాముడూ, కృష్ణుడూ, అమ్మ వారూ). పైపెచ్చు రాముడి కైతె ఎగ్జిక్యూటివ్ క్లాసు, కృష్ణుడికైతె ఎకానమీ క్లాసా అని అడిగారు. కనీసం టైటిల్ లో పేరు కూడా లేదాయె అని వాపొయారు (సరదాకి)

సరదా గా అన్న.. సూచన ని స్వీకరించి తగు జాగ్రత్త తీసుకుంటా...

సనత్ కుమార్.

కామేశ్వరరావు said...

సనత్కుమార్ గారు,

అద్భుతమనిపించే మీ భావాల ముందు వ్యాకరణ ఛందో దోషాలని ఎంచ బుద్ధి వెయ్యదండి!
"శరదృ" లో ర గురువు అవ్వదు. "ఋ" అన్నది ఒక అచ్చే కాబట్టి "దృ" సంయుక్తాక్షరం కాదు. ఉచ్చరించేటప్పుడు కూడా "ద"కారమ్మీద ఊనిక పడకూడదు. మీరన్న "శ్రీ" విషయంలో తప్పేమీ లేదు. "దేహకాంతి" "శ్రీకరముల" వేర్వేరు పదాలు కాబట్టి, "తి" గురువు కానక్కరలేదు.

Sanath Sripathi said...

గురువు గారూ, రాఘవ గారూ !!
అద్భుతం. అరటి పండు వలిచి పెట్టినట్టు చాలా తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పారు. కృతజ్ఞతలు.