Friday, February 20, 2009

రాముడూ - స్ఫూర్తి - 6 - ఉడుత.

రామాయణం లో ఉడుత ది ఒక ప్రత్యేక స్థానం. అది మనకందరికీ తెలుసు. ఆ కథ వెనుక నాకు స్ఫురించిన ఒక భావన.

రామాయణం లో ప్రధాన ఘట్టం రావణ వధ జరిగిపోయింది. తన ధర్మ సంస్థాపనా మార్గం లో సాయం చేసిన వారందరినీ ఏం కావాలో కోరుకొమ్మన్నాడుట రాముడు. జాంబవంతుడు నీతో యుధ్దం చెయ్యాలని ఉంది అన్నాడుట. అలా ఒక్కొక్కరే వచ్చి ఏవేవో కోరుకున్నారుట.

ఆ వరుసలో ఆఖర్న ఉన్నవారిని చూసి రాముడి కళ్ళు మెరిసాయిట. తనే లేచివచ్చి పలకరించాట్ట. "పూర్వ భాషీ.." కదా... ఆ ఆప్యాయతకు అక్కడున్నవారందరూ చాలా పులకరించారుట. ఇంతకీ అక్కడున్నది మరెవరో కాదు. మన ఉడుత. నీకేం కావాలి అని అడిగాడుట.

"నను పాలింపగ నడచీ వచ్చితివా... స్వామీ !! ఏమని కోరుకుందును?

మనకి అత్యంత ఇష్టమైన వారి సాన్నిధ్యం లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఏం తింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్న స్ఫురణ ఉండదు. అన్నీ కరిగి పోయిన స్థితి లో ఉంటామట కదా, అదీ తెలియదు నాకు కానీ ఏదో అనుభూతి మాత్రం మిగిలి ఉంది. ఇంతకపూర్వం మనం కలుసుకున్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. అందరూ మాత్రం నేను చేసిన సహాయం చిన్నదే అయినా నువ్వు ఆప్యాయంగా నా వీపు నిమిరావనీ అప్పుడు గుర్తుగా వీపుపై మూడు గీతలు పడ్డాయనీ అంటున్నారు.

నాకు మాత్రం అది నిజం కాదేమో అని అనిపిస్తోంది. నీకు అత్యంత ప్రీతి పాత్రమైన పని చేసినప్పుడు నువ్వు ఆనందాన్ని వ్యక్త పరచే విధానం ఒకటుంటుంది. "సోదర భరత సమానా" అని హృదయానికి హత్తుకుంటావు. నేను చేసినది సహాయం చిన్నదే అయినా నీకు ఆనందం కలిగించే ఉంటుంది. వీలైనంత సహాయం చేద్దాం అనుకున్న ఆ స్ఫూర్తి కి మెచ్చి నన్ను నీ ఎడమ చేతిలో తీసుకుని కుడి చేతితో హృదయానికి హత్తుకుని ఉంటావు అప్పుడే జన్మించిన శిశువుని హృదయానికి హత్తుకున్నట్టు. అప్పుడు కలిగినవే అయి ఉంటాయి ఈ గుర్తులు. నేను ఆ ఆనందానుభూతి లో ఉన్నాను కనుకనే అప్పటి సంగతులేవీ గుర్తు లేవు. దయచేసి మరొక్కమారు గాఢ ఆలింగనానుభూతిని అనుగ్రహించవా?
పరిష్వంగానుభూతి లో ఇంకొక్కసారి ఓలలాడించవా" అని అడిగిందిట ఉడుత.

ఉ!! "శ్రీరఘు రాముడే ఉడుత సేవను మెచ్చి స్పృశింప, వీపు పై

చారలు గుర్తుగా మిగిలె! జన్మతరించె !"నటంద్రు పెద్దలున్

ఆరయ నాకు తోచె పరిహారములన్ గొని కౌగలించుటే

కారణమంచు, నీవు పసికందును గుండెకు హత్తుకోవటే !!

స్ఫూర్తి:

(1) భద్రాచలం గుడి లో ఆరగింపు జరిగే సమయం లో ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉండమంటారు. అక్కడ కూర్చుని ఉన్న సమయం లో అటూ ఇటూ ఉడుతలు పరుగెడుతున్నాయి.

(2) మా నాన్న గారు ప్రతీ రోజు తన భోజనం లో మొదటి ముద్ద గోడమీద పెట్టినప్పుడు రోజూ ఒక ఉడుత వచ్చి తినేది. దాదాపు 5-6 నెలలు నేను గమనించాను. ప్రతీ రోజూ నాన్నగారి ముద్ద కోసం అది ఎదురు చూసేది. ఎంత హడావుడి లో ఉన్నా నాన్నగారు దానికి ఏదో ఒకటి పెట్టి కానీ బయటకి బయల్దేవారే కారు.

అలా గుడి లో ఉడుతల ను చూడగానే ఇంటి దగ్గర జరిగే సంఘటన, నాన్నగారు కళ్ళ ముందు ఆడారు, కళ్ళు చెమ్మగిల్లాయి. మనసు ఆనందం తో నిండగానే గుడి తలుపులు తీసారు.

రామ దర్శనం చేసుకుంటున్నపుడు కలిగిన భావన.

ఇంతకీ చెప్పనే లేదు కదూ !! మా నాన్న గారి పేరు శ్రిపతి రఘు రామ కుమార్. 'శ్రీ రఘు రాముడే' అని మొదలుపెట్టటం యాదృచ్చికమే .

5 comments:

రాఘవ said...

బావుందండీ.

ఏ విషయమైనా సరే అనుభవించి వ్రాసినదానికీ ఊహించి వ్రాసినదానికీ తేడా ఉంటుంది. అనుభవించి వ్రాస్తే చదివేవారికి కూడా ఆ భావం అనుభవంలోకి వస్తుందనడానికి ఇదిగో ఇది ఒక నిదర్శనం.

Sanath Sripathi said...

రాఘవ గారూ !

సహృదయులైన మీవంటి పాఠకుల మనసు రంజిల్లజేసినందుకు సంతొషం గా ఉంది. మనస్ఫూర్తి గా అందిస్తున్న ఈ కృతజ్ఞతలు అందుకోండి.

-సనత్

కామేశ్వరరావు said...

మీ పద్యాలు ఉడత వీపుపైనున్న చారలంత అందంగా ఉన్నాయి, బహుశా అవేనేమో!
"నూపుపై" - "వీపుపై" అని ఉండాలేమో?

Unknown said...

Raghava garu,
Vidhumaouli (ma baava from Hyderabad)mee "udutaa bhakti"ni naaku forward chesaru.
Chaala Hrudyangaa undi. Maaintimundu chetla pai chaala udutalu tirugutu untayi.
Mee anubhavamu chadivina tarvaatha vaatipai apyayata kalugutondi. Nenu vaatiki tinadani ki ginjalu pallu pedutunnanu.

Namaskaramu lato
C V Ramu
Bangalore

Sanath Sripathi said...

కామేశ్వర రావు గారూ, 'వీపు పై' అన్నదే సరియైనది. సరిజేసినందుకు, ప్రోత్సాహకర వ్యాఖ్యలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

విష్ణు రాము గారూ !!
నెనరులు.