Tuesday, March 10, 2009

వ్యాసుడూ -Vs - ఆది శంకరులూ

వ్యాసుడూ -Vs - ఆది శంకరులూ - ఆమ్మవారి వర్ణన.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అసలు విజయవాడ లో దుర్గమ్మవారి అలంకరణ లో కిటుకు ఏమిటో తెలియదు కానీ ఆవిడ నవ్వు మాత్రం బిలియన్ డాలర్ స్మైల్ కి కొన్ని వందల రెట్లు ఉన్నట్టు ఉంటుంది.

ఆదివారం అనుకొకుండా దర్శనం చాలా బాగ జరిగింది. వీలున్నత దగ్గర గా చూడచ్చు కదా అనే స్వార్ధం తో 50 రూపాయల టిక్కెట్టు తీసుకుని వెళ్ళా. క్యూ లో లలితా సహస్రనామం చదువుకుంటూ వెడుతూంటే, ఒక్కొక్క నామం వర్ణన ముమ్మూర్తులా కళ్ళ ఎదురు గా ఉన్నట్టు కనిపించింది అమ్మవారిని చూస్తూంటే. బయట కూర్చుని లలితా పారాయణ అయ్యక సౌందర్య లహరి చదువుకుంటే ఆలొచన ఒకటి మెరిసింది. భలే అనిపించింది. (ఇది ఇంతక ముందే అందరికి గమనిక కి వచ్చి ఉండచ్చు, నాకు మాత్రం ఇప్పుడే 'యురేకా 'అయ్యింది.)
కురువింద మణి శ్రెణీ కనత్కొటీర మండిత తో మొదలుపెట్టి వ్యాసుల వారు నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ, ఫదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా, శింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజా వరకూ వర్ణించారు. అంటే కురులతో మొదలు పెట్టి కాలి గోళ్ళు వరకూ అమ్మ వారి సౌందర్యం ప్రతీ అవయవాన్ని ఆవిష్కరించారు.

కళ్ళు మూసుకుని చదువుతూంటే, ఒక బొమ్మని / పటాన్ని క్రమం గా ఉన్మీలనం చేస్తున్నట్టు పై నుంచీ కింద వరకూ వర్ణన ఉంటుంది. చూడండి కావాలంటే...కురులు, విశాలమైన నుదురు, కళ్ళు, ముక్కు, ముక్కు పుడక, చెవులు, చెవులకి దుద్దులు, చెంపలు, చిరునవ్వు, చుబుకము, స్తనములూ, పాదాలూ, కాలి గోళ్ళు...

వ్యాసుల వారి వర్ణన ఇలా ఉంటే, శంకరుల వారు పాదాల నుండీ మొదలుపెడతారు.తనీయాంసం పాంసుం అని పాద రేణువుల తో మొదలు పెట్టరు.

ఒకరు ఆరోహణ క్రమం లో చెబితే ఒకరు అవరోహణ క్రమం లో చెప్పారు (అనిపించింది).

తెలిసిన వారు దీని పై ఇంకొంచం వివరణ/ సమాచారం/జ్ఞానం ఇస్తే బాగుంటుందని అనిపించి సాదరం గా వారిని ఆహ్వానిస్తున్నా.

సందర్భం వచ్చింది కాబట్టి మరో మాట. పని లో పని గా ఆమ్మ వారి పై నేను రాసుకున్న ఒక పద్యం.

నాకు సౌందర్య లహరి లో జ్ఞానం బహు తక్కువ. సౌందర్య లహరి లో ప్రతి శ్లోకానికీ బోలెడంత అంతరార్ధం ఉన్న మాట నేనూ విన్నాను. కొంచం తెలుసుకునే ప్రయత్నం చేసాను.

ఎందుకో నిన్ను కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టినీ చేయగల సామర్ధ్యం కలిగినవాడౌతాడు శివుడు. నీవు లేకున్నచో వేలు కూడా కదపలేడు. బ్రహ్మ విష్ణు శివాదులచే కొలువబడే అట్టి నిన్ను కీర్తించగలుగు వాడు అకృత పుణ్యుడెత్లగును? అన్నది మిగిలిన శ్లోకాలలో అమ్మవారిని కీర్తిస్తునట్టు గా కీర్తించినట్టు అనిపించలేదు.

తప్పేనని తెలుసినా అదేదో ఫల శృతి ముందు గా చదివినట్టు అనిపించింది. (నా దృష్టి లో), అందుకే శ్లోకం లో స్ఫూర్తి మాత్రం తీసుకుని నేను రాసుకున్న వేరే పద్యం.

ముందే చెప్పేస్తున్నా... సంస్కృత శ్లోకానికీ దీనికీ ఎక్కడా సంబంధమూ/ పోలికా లేనే లేదు.


లోకమ్ముల్ సృజియింపగన్ ముడిపదార్ధంబెద్ది అవ్యక్తుకున్ !
లోకారాధ్య త్రిమూర్తి సన్నుత పదాబ్జంబెద్ది శ్రేయమ్మిడన్ !
శ్రీ కైవల్య పదంబు చేరుటకు తేజో మార్గమై వెల్గు ఆ
హ్రీంకారాసన గర్భితానల శిఖన్, కీర్తింతు వాగర్ధులన్.

ఏదో కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు మూలానికీ సంబంధం లేకుండా రెండు మూడు జొప్పించినట్టు అనిపించవచ్చు. నేను ప్రయత్నం చేసి జొప్పించినదెమీ లేదు. దుర్గా దేవి చీకటి లో దారి చూపే వెలుగు(to mark the light in darkness) అనీ శ్లోకం చదువుతున్నప్పుడు అప్రయత్నం గా నాకు తట్టిన భావం ఇది.

3 comments:

Anonymous said...

సనత్,
ఇక్కడొక విచిత్రం ఉంది. సాంప్రదాయం ప్రకారం దేవతలని పాదాలనుండి కేశాలవరకూ, మానవస్త్రీలని కేశాలనుండి పాదాలవరకూ వర్ణనలు చెయ్యాలి.

ప్రమాణం: కుమార సంభవంలో ప్రథమ సర్గలోని పార్వతీదేవి వర్ణన చూస్తే పాదాలతో ప్రారంభం అవుతుంది. (33వ శ్లోకం). అక్కడ మల్లినాథుడన్న వాక్యం: దేవతానాం రూపం పాదాఙ్గుష్ఠప్రభృతి వర్ణ్యతే, మానుషాణాం కేశాదారభ్యేతి ధార్మికా: ||

కానీ లలితాసహస్రంలోనూ, సౌందర్యలహరిలోనూ కూడా అమ్మవారి వర్ణన కిరీటం/కేశాలనుంచే ప్రారంభం అయ్యి, పాదాల వర్ణన/స్తుతితో ముగుస్తుంది. కాబట్టి శంకరులూ, లలితాసహస్రకారుడూ ఈ సాంప్రదాయాన్ని పాటించలేdu, ఎందుకనో. కాళిదాసు శంకరులకన్నా పూర్వుడు కాబట్టి ఈ సాంప్రదాయం శంకరుల కాలంలో లేదనలేము.
అదలా ఉంచితే -

సౌందర్యలహరిలో ఒకటి నుంచీ నలభై ఒకటో శ్లోకం వరకూ ఆనందలహరి అనబడుతుంది. మిగతాది సౌందర్యలహరి. మొదటి భాగంలో అమ్మవారి సూక్ష్మతత్త్వ వర్ణన ఉంటే, రెండో భాగమైన సౌందర్యలహరిలో అమ్మవారి స్వరూప వర్ణన ఉంటుంది. అందులో 42వ శ్లోకం కిరీట వర్ణనతో ప్రారంభం అవుతుంది. ఒకసారి పరిశీలించు. అంతే కాకుండా ఒకసారి లలితాసహస్రంలోని వర్ణనల్నీ, సౌందర్యలహరిలోని వర్ణనల్నీ పోల్చి చూసుకుంటే చాలా ఆనందం కలుగుతుంది.

ఇప్పటికే వ్యాఖ్య పెద్దది అయింది. నీ టపా బాగుంది. పద్యం కూడా చాలా బాగుంది.

రాఘవ said...

సౌందర్యలహరి గురించి (చాగంటి కోటేశ్వరరావుగారు చెప్పిన ప్రవచనంలో అనుకుంటాను)... సాక్షాత్తూ పరమశివుడు తప్ప అన్యులెవరూ అమ్మవారి వైభవాన్ని అంత అద్భుతంగా చెప్పలేరు. ఆదిశంకరులు సాక్షాత్తూ కైలాసశంకరులే. కైలాసశంకరులు చెప్పిన సౌందర్యలహరిని ఆదిశంకరులు భూమిపైకి తెచ్చారు. దానిలో కొంత భాగం ఖిలమైపోగా ఆదిశంకరులు తానే పూర్తిచేసారు.

పైగా వ్యాసులవారు, ఆదిశంకరులు అవతారమూర్తులు. ధర్మాధర్మాలకి అతీతులు, కవిత్వ సంప్రదాయాలంటారా సరేసరి.

యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే.

Sanath Sripathi said...

మురళీ, రాఘవ గారూ !! మీకు నా ధన్యవాదాలు.

మురళీ !! నువ్వన్నట్టు సౌందర్య లహరి లో 41 వ పద్యం నుండీ వర్ణన నేను కూడా గమనించా !! కాకపోతే మహన్యాసం లో ముందు గా దశాంగ రౌద్రీకరణమూ తరువాత షోడశాంగ రౌద్రీకరణమూ ఉన్నట్టు గా ముందు క్లుప్తముగా గా చెప్పి తరువాత వివరణగా చెప్పరేమో అని అనుకున్న...(సంస్కృతం లోనూ, సంస్కృతం లో వర్ణన ప్రక్రియ పైనా నాకు అవగాహన బహుతక్కువ కదా). అయితే అక్కడ రెండు సార్లూ శిఖ నుండీ మొదలు పెట్టి పాదాల వరకూ చెప్పారనుకో..

ఏదేమైనా మొత్తం 100 శ్లొకాలలో 1,100 తప్ప మిగిలినవి అమ్మవారితో మాట్లాడినట్టూ, అమ్మ వారిని వర్ణిస్తునట్టు అనిపిస్తాయి. ఈ రెండు మాత్రం వేరే ఎవరితోనో సంభాషిస్తున్నట్టు, వారికి సమాధానం ఇస్తున్నట్టు అనిపిస్తాయి. పద్యం లో ప్రౌఢి గురించి అలోచించే స్తోమత కూడా ఏమాత్రం లేని వాడినే కానీ, నా చిన్ని బుర్ర కి ఈ పద్యాల ప్రౌఢి మిగిలిన పద్యాల తో సరి సమానంగా అనిపించదు. పోతన భాగవతం లో కొన్ని పద్యాలు మిగిలిన వాక్ప్రవాహానికి సరిపోనట్టు గా ఉంటాయి కదా.. అలాగే ఇవి కూడా వేరే ఎవరైనా రాసి ఉండి ఉంటారేమో అని నా అనుమానం.(నిర్ధారించటానికి కావలసినంత పరిజ్ఞానం నాకు లేదనుకో..)

రాఘవ గారనట్టు శంకరశ్శంకరస్సాక్షాత్, వ్యాసో నారాయణో హరి: కాబట్టి అది నేను పూర్తి గా అర్ధం చేసుకోలేదేమో కూడా..