Tuesday, November 2, 2010

పోతనవారి "కాపీ" పద్యాలు

పోతనామాత్యుణ్ణి కాపీకొట్టాడు అనటం భావ్యం కాదేమో కానీ పోతనను అంతగా ప్రభావితం చేసిన ఎఱ్ఱన వారి అనుసరణ, అనుకరణలతో పోతనకృతులు చూస్తూ ఉంటే....స్ఫూర్తిగొన్న పద్యాలనటం బావుంటుందేమో...

అసలు పద్యం 1: (నృసింహ పురాణం . 5-22)
వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి
తగదను తండ్రియు తండ్రికాదు
వేదచోదితమైన విష్ణుధర్మమునకున్
గోపించు గురుడును గురుడుగాడు
భవదుఃఖముల మ్రాంప బ్రభువైన హరిసేవ
నెడలించు హితుడును హితుడుగాడు
వరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు
వదలిన చదువును చదువు గాదు
కేశవాకార లీలలు గీలుకొని ము
దంబు బొందని తలపును తలపుగాదు
మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల
జిలుకకుండెడి జిహ్వయు జిహ్వ కాదు.

కొసరు పద్యం 1: (పోతన భాగవతం 7- 169)
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
శేష శాయి కి మొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు
పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పిడి గురుడు గురుడు
తండ్రి హరిచేరుమనియడీ తండ్రి తండ్రి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అసలు పద్యం 2: (నృసింహ పురాణం . 5-78)
కలడు మేదినియందు కలడుదకంబుల
గలడు వాయువునందు గలడు వహ్ని
గలడు భానుని యందు గలడు సోముని యందు
గలడంబరమున గలడు దిశల
గలడు చరంబుల గలడచరంబుల
గలడు బాహ్యంబున గలడు లోన
గలడు సారంబుల గలడు కాలంబుల
గలడు ధర్మంబుల గలడు క్రియల
గలడు కలవాని యందును గలడులేని
వానియందును గలడెల్ల వాని యందు
నింక వేయునునేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందు గలడు గలడు

కొసరు పద్యం 2 :  (పోతన భాగవతం 7- 274)

కలడంబోధి గలండు గాలి గలడాకాశంబునం గుంభినిం
గలడగ్నిన్ దిశలంబగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మ లం
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులందంతటం
గలడీశుండు గలండు తండ్రి వెదకంగా నేల యీ యాయెడన్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

అసలు పద్యం 3: (నృసింహ పురాణం . 3-150)
కుడిచినపుడు నిద్రగూరినయప్పుడు
మేలుకొనిన యపుడు మెలగినపుడు
విష్ణు కీర్తనంబు విష్ణు చింతయు కాని
పలుకడొండు బుధ్ధి దలపడొండు

కొసరు పద్యం 3: (పోతన భాగవతం 7- 123)
పానీయంబులు డ్రావుచు న్ గుడుచుచున్ భాషించు చు న్ హాస లీ
లా నిద్రాదులు సెయూఛూన్ దిరుగుచున్ లక్షించుచున్ సంతతా
శ్రీ నారాయణ పాద పద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భువరా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అసలు పద్యం 4: (సోమనాధుని బసవ పురాణం లోని ద్విపద. 3 - 82)
క్షీరాబ్ధి లోపలక్రీడించు హంస
గోరునే పడియల నీరు ద్రావంగ(?
జూత ఫలంబులజుంబించు చిలుక
భ్రాతి బూరుగు మ్రాని పండ్లు  గన్గొనునె?
రాకామల జ్యోత్న దావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?
విరిదమ్మి వాసన విహరించు దేటి
పరిగొని సుడియునే ప్రబ్బిలి విరుల?

కొసరు పద్యం 4: (పోతన భాగవతం 7- 150)
మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల దూగు
రాయంచ జనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల జేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం
బరుగునే సాంద్ర నీహారములకు
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు చేరనేర్చు
వినుత గుణశీల మాటలు వేయునేల.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అనుసరణ పద్యాలన్నీ చిత్రంగా సప్తమస్కంధంలో ప్రహ్లాద చరిత్రలోనే ఉండటం, వాటికి స్ఫూర్తినిచ్చిన పద్యాలు నృసింహపురాణంలోవి కావటం వెనక కారణం బహుశా భాగవతంలోని ఆ కథా రచన చేసేముందు పోతనామాత్యుడు నృసింహపురాణాన్ని ఆస్వాదించి ఉంటాడేమో... అందుకే అట్లాంటి భావాన్నే చెబుదామనుకున్నప్పుడు పద్యం కూడా అట్లానే వచ్చేసి ఉండి ఉంటుంది. (ఇది నా ఊహ మాత్రమే సుమా ! )     

Wednesday, October 6, 2010

పద్యం అనుకరణ, అనుసరణ



Copy from one, it's plagiarism; copy from two, it's research --Wilson Mizner (1876 - 1933)


ఎకడమిక్స్ లో దీన్ని రిసెర్చ్ అంటారు, ఆర్టులో "స్ఫూర్తి" అంటారు :-) --'ఫలానా' కామేశ్వరరావు గారు. 


రవిగారు తమ బ్లాగాడిస్తా లో  పద్యం రాద్దామనే ఔత్సాహికులకు సూచనలు ఇస్తూ "ఇదివరకు ప్రముఖ కవులెవరైనా వ్రాసిన టెంప్లేటును వాడుకుని మీరు అందులో సబ్జెక్టు, కొన్ని పదాలు మార్చి, మీ పద్యంలా భ్రమింపజేయవచ్చు. ఇదొక ట్రికీ కళ. అలవడితే మాత్రం భలే రంజుగా ఉంటుంది" అన్నారు. దాన్నించి స్ఫూర్తి పొందినదే ఈ టపా.


పద్య రచనలో అనుకరణ, అనుసరణ వీటికి ఒక ప్రత్యేకత ఉంది. మనలను ప్రభావితం చేసిన వారి పంథాలో మనమూ నడిస్తే (ఇష్టం ఉన్న కారణం చేత) అప్రయత్నం గా మన రచనలో వారి శైలి పొడచూపితే అది అనుకరణ. ఇక్కడ స్ఫూర్తి పద ప్రయోగం వరకు మాత్రమే నియమితమై ఉంటుంది.


ఉదా. "మందర మకరంద" అనో, "ఎవ్వనిచే జనించు" అన్న పదంతోనో ఏదైనా పద్యం మొదలైతే, చదువరులకు అసలు పద్యం (చిరస్థాయిగా నిలిచిఉన్న ఆణిముత్యాలవంటి పద్యాలు) స్ఫురణకు రావటం, ఆహ్లాదం కలగటం అన్నవి అటువంటి ప్రయోగాలకు, పదాల వాడుకకూ స్ఫూర్తి.


అదేకనుక పద్యభావం నుండి కూడా స్ఫూర్తిపొందితే అది అనుసరణ. ఒక విధం గా చెప్పలంటె తత్ మూల పద్యాన్ని రాసిన కవికి ఈ పద్య రచయిత సమర్పించుకునే కృతజ్ఞతాపూర్వక నమస్కృతి అన్నమాట.


పోతన కృతులలో నేను గమనించిన కొన్ని అనుకరణలు...అనుసరణలూ....


కవిత్రయంలో ముందుగా "ఆంద్ర కవితా గౌరవ జన మనోహారి నన్నయ్య సూరి" అని పిలువబడ్డ నన్నయ్య కవితానుసరణ


నన్నయ్య:


శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే


పోతన- (వీరభద్ర విజయము లో ఇట్లనువదింపబడింది)
సిరియును వాణి గౌరి యనుజెన్నగు కన్యకు మేను, వాక్కు బె
న్నురమును నుంకువిచ్చి ముదమొప్పవరించి జగంబులన్నియున్
దిరములు సేయబ్రోవదుదిదీర్పగ ద్రష్టయుగేక్షణుండునై
హరివిధిశంభుమూర్తి యగు నాద్యుడు మాకు ప్రసన్నుడయ్యెడిన్.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"హరి హర చరణారవింద వందనాభిలాషిందిక్కన మనీషింభూషించి" అని కీర్తించిన తిక్కన అనుసరణలు


తిక్కన 1 :


రాజటె ! రాగహీనుడతె ! రాజిత సుందరమూర్తి యట్టె ! వి
భ్రాజిత సంపదున్నత విభాసిత వర్తనుడట్టె ! కామినీ
రాజ మనోజ్ఞ భంగి చతురత్వధనుండటె ! బ్రహ్మచర్య దీ
క్షాజిత మన్మధుండునటె జన్మము లిట్టివు యెందు గల్గునే ? --> (శాం. 2 -103)


పోతన:
రాజటె ! ధర్మజుండు ! సుర రాజ సుతుండతె ధన్వి! శాత్రవో --> (1 - 211)


తిక్కన 2 :
సకల స్థావర జంగమంబులు భవత్సాన్నిధ్య మాత్రంబునన్ --> (ఉద్యో. 1 - 186)


పోతన 2:
సకల స్థావర జంగమ ప్రతతికిన్ జర్చింప దానాఢ్యుడై --> (3 -1019)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


ఎఱ్ఱన రచించిన నృసింహ పురాణం లో పద్యాలకు పోలికగలిగిన పోతన పద్యాలు.....


అసలు 1:
వాసుదేవుని పాదవనరుహంబుల భక్తి తగదను తండ్రియు తండ్రికాదు
వేదచోదితమైన విష్ణుధర్మమునకున్ గోపించు గురుడును గురుడుగాడు
భవదుఃఖముల మ్రాంప బ్రభువైన హరిసేవ నెడలించు హితుడును హితుడుగాడు 
వరయోగ మతమగు వైష్ణవ జ్ఞానంబు వదలిన చదువును చదువు గాదు
కేశవాకార లీలలు గీలుకొని ము
దంబు బొందని తలపును తలపుగాదు
మాధవస్తోత్ర ఘన సుధా మధుర రుచుల 
జిలుకకుండెడి జిహ్వయు జిహ్వ కాదు. ---> (నృ. 5-22)


కొసరు పద్యం 1 ఏమిటో చెప్పగలరా?


అసలు 2: 
కలడు మేదినియందు కలడుదకంబుల
గలడు వాయువునందు గలడు వహ్ని
గలడు భానుని యందు గలడు సోముని యందు
గలడంబరమున గలడు దిశల
గలడు చరంబులచరంబుల గలడు బాహ్యంబునగలడు లోన
గలడు సారంబులగలడు కాలంబుల గలడు ధర్మంబులగలడు క్రియల
గలడు కలవాని యందును గలడులేని
వానియందును గలడెల్ల వాని యందు
నింక వేయునునేల సర్వేశ్వరుండు
కలడు నీయందు నాయందు గలడు గలడు --> (నృ. 5 - 78)


కొసరు పద్యం 2 ఏమిటో చెప్పగలరా?


అసలు 3:
కుడిచినపుడు నిద్రగూరినయప్పుడు
మేలుకొనిన యపుడు మెలగినపుడు
విష్ణు కీర్తనంబు విష్ణు చింతయు కాని
పలుకడొండు బుధ్ధి దలపడొండు --> (నృ.3 - 150)


కొసరు పద్యం 3 ఏమిటో చెప్పగలరా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


సోమనాధుని బసవ పురాణం:


క్షీరాబ్ధి లోపలక్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావగ?
జూత ఫలంబులజుంబించు చిలుక
భ్రాతి బూరుగు మ్రాని పండులు గన్గొనునె?
రాకామల జ్యోత్న దావు చకోర
మాకాంక్ష సేయునే చీకటి ద్రావ?
విరిదమ్మి వాసన విహరించు దేటి
పరిగొని సుడియునే ప్రబ్బిలి విరుల? --> (3 - 82)


కొసరు పద్యం 4 ఏమిటో చెప్పగలరా?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


భాస్కరుని రామాయణం:


కుప్పించు నురవడి గుంభిని వడిగ్రుంకి
సర్వాధిపతి తలల్ సదియ నదుమ
నగయు నూకున మీది కెత్తి పాఱిన తరు
శ్రేణులు చుక్కలు జెదర నడువ
నెఱకలు జాడించు నేపున గడలెత్తి
యేడు వారాసులు నెడములొత్త
బఱచు బల్వడి నభ్ర పంక్తులు సుడిగొంచు
వలయంపుగొండ యవ్వలికి దూల దూల
పర్వతములు వడక్ బ్రహ్మాండ కోటర
మదృవ గగన వీధి నరుగుదెంచె?
రఘుకులేంద్ర బంధ విఘటనత్వరితాంత  
రంగుడగుచు నవ్విహంగ విభుడు.


కొసరు పద్యం 5 ఏమిటో చెప్పగలరా?

Saturday, September 11, 2010

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు !!!

అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. 

వినాయక చవితికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెబుతున్నాడేంటి అని హాస్చర్యపోవద్దు. నేనెక్కాల్సిన ట్రైను జీవితకాలం లేటు అన్నట్టు ఇన్నాళ్ళకి గానీ వీలు పడలేదు. అయినా ఇవ్వాళ కథ చదువుతూంటే రాద్దామనుకున్న టపా రాయలేదని గుర్తొచ్చింది.  

"మనుషులను వస్తువులుగా , వ్యాపారవస్తువులుగా చూస్తున్న ఈ కాలంలో వస్తువుల మనసుల్లోకి తొంగిచూడటం మీకే చెల్లు" అని ఒక బ్లాగ్మిత్రులు ఒకానొకసారి నా టపాలో వ్యాఖ్యానించారు. వారికి అనేకానేక ధన్యవాదాలు.

వస్తువుల మనస్సునైతే అర్ధంచేసేసుకోవచ్చు, వచ్చే ఇబ్బందేం లేదు. మనుష్యుల మనస్సులు అర్ధంచేసుకోవటం మొదలైతే ఇంకేమన్నా ఉందా? ఉదాహరణకి కళాంజలో, కళానికేతనో దాటేస్తూంటే శ్రీమతి మదిలో మెలిగే శతాధిక భావాలు నాకు అమాంతం అర్ధమయిపోయాయనుకోండి, నాగతేంకాను? ఆ నడిరోడ్డుమీద ఉక్కిరి బిక్కిరి అయిపోనూ? ఆఫీసులో టాస్కులిచ్చి ఇంకంటాక్సువాడి మాదిరి పీల్చిపిప్పిచేస్తే టీమ్మెంబరుగాళ్ళు తిట్టుకునే శాపనార్ధాలు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? 'ఢా'మ్మని అక్కడికక్కడే పోనూ? అందుకే  వస్తువుల మనసుల్లోకి తొంగిచూడటం కొంచం సేఫ్. అవైతే నిష్కర్షగా "నా భావం అది కాదు మొర్రొ" అని ఖండించవుకదా. నిర్మొహమాటంగా వాటి పేరు మీద మనకి తోచింది, నచ్చిందీ చెప్పేయచ్చు. అది నా ధీమా.

నిజానికి నేన్రాసుకున్న పద్యాలని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూంటే ( రాసినవి కొన్నే అనుకోండి) అప్రయత్నంగానే భావావిష్కరణలో నా మొగ్గు ఖనిజాలు,వృక్షాలు,జంతువుల పైకే ఎక్కువ తూగుతుంది.

రాముడు-స్ఫూర్తి పద్యాల్లో రాళ్ళు రాముడి మరదళ్ళమని ఫీలయినా, జలచరాలు రాముడిమీద అలిగి అటకెక్కినా, తక్కెడ ధర్మాధర్మాల గురించి రాముణ్ణి నిలదీసినా, ఉడుత "గాఢపరిష్వంగ" వాంచని రాముడికి విన్నవించున్నా, తాటాకు చప్పట్లలో తాటి చెట్టు తన వేదనని నివేదించుకున్న;  పులి విలాపం అన్నా ...అన్నిట్ళో ఉన్నది అదే.

అయితే ఈ మొగ్గు అప్రయత్నం అని ఎందుకన్నానటే నేన్చదువుకున్న పద్యాలు అట్లాంటివి మరి. బోయిభీమన్నగారి ప్రభావం నామీద అలాంటిది. ఇంతకముందు టపాలో చెప్పినట్టుగా, బోయి భీమన్నగారు ఓ రకంగా నాకు ఏకలవ్య గురువుగారు. ఏకలవ్య గురువుగారు అని ఎందుకు అన్నానంటే నా ప్రమేయం లేకుండానే నాలోనికి చొరబడి నన్ను ప్రభావితం చేసేశారు కాబట్టి.

ఒక గ్రీటింగు షాపు కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వందలాది గ్రీటింగుల్లో ఒక్కటి మాత్రమే మనకి తెగ నచ్చేస్తుంది. ఎందుకంటే అది మనం చెప్పకపోయినా మన హృదయాన్ని మాటల్లో ఆవిష్కరించినట్టు అనిపిస్తుంది.

బోయిభీమన్న గారి "మణి మానసం" కావ్యం నా దృష్టిలో అట్లాంటిదే.



అపూర్వమైన ఒక పరిచయం, ఒక స్నేహం, ఒక సన్నివేశం, ఒక చిరునవ్వు, ఒక వక్రోక్తి, ఒక వాలుచూపు -- ఇందులో ఏ ఒక్కటైనా చాలు - భావానికి సౌకుమార్యం కలిగించి ఉద్వేగపరచటానికి, అవ్యక్తమై ఉన్న అనుభూతిని తట్టి లేపటానికి.

ఆత్మతో కలిసిపోయిన అనుభవ్సారమే అనుభూతి. అనుభూతి జాగృతం కావడమే భావ స్పర్శ. అట్టి అనుభూతి రససంబంది అయినప్పుడు కళాసృజన జరుగుతుంది. రసానుభూతికి రూపకల్పనలే కళలు -- సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం వంటి కళలకు మూలబీజం రసమే.

లోకిక, భౌతిక, వ్యావహారిక, శారీరక సంబంధ బాంధవ్యాలతో ప్రమేయం లేని మనోరమణమే రసస్థితి. విప్రలంబ శృంగారమే రసాద్వైతానికి బీజం. వియోగం వల్ల మనోరమణం ఏర్పడి నిరంతర ధ్యానం వల్ల తాదాత్మ్యం సిధ్ధిస్తుంది. ఇది భక్తికంటే మధుర భక్తికంటే భిన్నం. ఇది స్త్రీ పురుష మనస్సంబంది. పరమానంద సిధ్ధికి సహజ మార్గం. శ్రీకృష్ణుడు గోపికలకు ఉధ్ధవుడి ద్వారా పంపిన సందేశం లో  ఈ రసాద్వైత మూలసూత్రం కనిపిస్తుంది. ప్రతీ వ్యక్తి జీవితంలోనూ విప్రలంభం ఉంటుంది. అయితే గోపీకృష్ణ వియోగం ఒక శాస్వతమైన మధురవేదన. అందుకే దానిది సచ్చిదానంద రసస్థాయి.

అటువంటి రసానుభూతికి సాహితీ కల్పనే "మణి మానసం" కావ్యం.

శ్యమంతకమణి మానసం ఆ కావ్య వస్తువు, బీజం. భాగవతంలోని శ్యమంతకమణి కేవలం ఒక మణి. కానీ ఈ కావ్యంలోని శ్యమంతకమణి మానవ హృదయం కల ప్రేయసి. కృష్ణుణ్ణి ప్రేమించి, తన ప్రేమను అతడు గుర్తించకపోవడం వల్ల మూగ వేదనను అనుభవిస్తున్నట్టిది. ఒక్క ముక్కలో చెప్పలంటే శ్యమంతకమణి స్వాంతనం. గోపికలవలే కృష్ణుణ్ణి కామించి, ప్రేమించి, ప్రేమైకభావం లో తాదాత్మ్యత చెంది విరహవేదన అనుభవించినదే ఈ కావ్య నాయిక- శ్యమంతక మణి.

వినాయక చవితి సందర్భంగా గోపీకృష్ణుల రాసలీల స్మృతిగా ఆ పద్యాలు, మీకోసం... చదివి ఆనందించండి.. కృష్ణానుభూతిని అనుభవించండి.

పనిలో పనిగా కృష్ణాష్టమి సందర్భంగా ...నా 'గీత '

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

లూతల పట్టుకోక సిగలో ఎదొ పిట్టల ఈక, చుట్టునున్
వ్రేతల మూక, దట్టినొక వేణు శలాక; రసాధినేతకే
తాత యనంగ వెల్గెడునితండెవడా అనుకొంటి, కృష్ణ ! ని
న్నా తొలిసారి చూచి ! నయనామృతమయ్యనదే దినే దినే !

గాన రసమ్ముతో వెదురు కర్రకు ప్రాణము పోసినావు; నీ
వేణు రవమ్ముతో మొరటు వ్రేతను రాధనుజేసినావు; నీ
యాన రయమ్ముతో జడ మహస్సుకు కళ్ళెము వేసినావు; నా
మానస మంతకన్న ఖిలమా? ఖలమా? నినుగోరుటబ్రమా?

సూరుడు కాడె తండ్రి? తను చూడనిదున్నదె? నన్నెరుంగడే?
కోరిక దీర నే క్షణమొ కొమ్మని నీకిడడే- అటంచు నే
నారని ఆశ నుంటి ! అకటా ! తన దండకమున్ పఠించుచున్
దారిన పోవువానికొక దానయకున్ నను దానమిచ్చెపో !

నా యాత్మన్ కరగించి లోగొనినదే నాదౌ ! తదన్యం బదే
శ్రేయంబైనను వ్యర్థభారమె యగున్; చేతో ధరా ధారలో
నా యానందమె నాది; దానికొకడే నథుండు కృష్ణుండు; కృ
ష్ణా యోచింపు, ముపేక్ష చేసెదవు పో - షష్టాష్టకంబయ్యెడున్ !

మహిమ గలట్టి రత్నము శ్యమంతము, హేమము నిచ్చు, నంచు నన్
బహుగతులన్ నుతింత్రు; మరి నాకెవరిత్తురు నా అభీష్టముల్?
స్వహితము నైజమౌ మనుజ జాతికి! సర్వ హితైక మూర్తివౌ
మనుజుడవీవుగా? మణికి మాత్రము మానసముండదా? ప్రభూ?

బృందా సుందర సీమలో, మధురలో, వ్రేపల్లెలో రమ్య కా
ళిందీ తీరములో భవచ్చరణ సంలీనాత్మలై నిన్ను నీ
డెందమ్మున్ గొను చొక్కరొక్కరె నవోఢీ భూతలై కాంతలా
నందం బందుచు నుండ చూచెదను కానా? నే నలోలాత్మనా?

దీపజ్యోతికి మూలపీఠమయి తధ్ధీవల్లికిన్ పుష్పమై,
శ్రీ పాదమ్ముల నీలపద్మమై, తన్నృత్య క్రియా రంగమై
రూపారూప పరాప రోదిత కళా రోచిష్ణువై వెల్గు నీ
గోపీ వల్లభ మూర్తి నా కనులలో గోవత్సమై గెంతదే?

ఇంత ఉపేక్ష చేతువది ఎందుకొ? హేతువు కానరాదు ; నా
యంతట నేను వెంటబడినందుకొ? నాకిల నీవుతప్ప గ
త్యంతర  మేదియున్ గలుగ నందుకొ? దైవము జేసి నిన్ను నా
స్వాంతము నందు నిల్పుకొనినందుకొ? ధైర్యము చాలనందుకో?

మనసిది నిన్ను కోరి కడు మ్రగ్గుచునున్నది; తండ్రి యా మరో
మనుజునకిచ్చె; ఈ కొలది మన్గడయున్ దరిజేరి చచ్చెనా?
అనయము నెవ్వడో ఒకడు అగ్నికి కట్టియ రీతి వచ్చి నన్
చెనక దలంచు ! రుక్మ మొక చెడ్డది, రుక్మిణి మంచిదీ నటో?

ఆనాడే నను జూచి నీ మనసు రాగారక్తమైనప్పుడే
పోనిమ్మంచనుకోక, కాలగతిలో పోకళ్ళు గుర్తించి, పం
తానన్ రుక్మిణినట్లు నన్ను గొనియున్నన్ ఇంత కాకుండు ! దే
వా ! నీ దానను, నేటికైన నను గావన్ నేరవా? కోరవా?

జేజెలమీర నన్గొని ప్రసేనుడు చచ్చె; మృగేంద్రుడిల్గె; స
త్రాజితుడంతమయ్యె; శతధన్వుడునున్ తెగె; జాంబవంతుడు
గ్రాజియొనర్చె; నొచ్చె బలరాముడు; ఇంతయు నాగురించి ! స్వా
మీ! జగదాత్మ ! ఇంత అఘమెందుకు నా నుదుటన్ లిఖించితో?

మరిన్ని తర్వాతి టపాలో...