Friday, December 18, 2009

మా కిరాయి కోటిగాడు....(బుడుగు)

కథ, మాటలు --> నాన్న
అలంకరణ, అభినయం, పాటలు --> అమ్మ
చాయాగ్రహణం --> కిషోర్ మామ
గాత్ర దానం (డబ్బింగు) --> రాజు మామ
నిర్మత --> కామేశ్వరీ బామ్మ
దర్శకత్వం --> శ్రీదేవి అత్త

వీరందరి సౌజన్యం తో....బ్రహ్మాండమైన విడుదల...

మా ఇంట్లో కిరాయి కోటిగాడు




గళ్ళ షర్టు,
బుల్లి లుంగీ,
చేతిలో కర్ర,
మెదలో రుమాలు,
కంటి కింద చిన్ని పులిపిరి కాయ... అయనా నేనంటే భయం లేకుండా నవ్వుతునది ఎవర్రా...? ఏయ్...


ఏది? ...నా కర్ర ఏది??....
ఇప్పుడు చెప్పండి
ఏవర్రా అది....? నన్ను చూసి నవ్వుతున్నది?????
మాస్స్....మమమ్మాస్స్....
అన్న చెయ్యేస్తే మాస్స్....అన్న లుక్కేస్తే మాస్స్...
మమమ్మాస్స్....

Monday, November 16, 2009

రాముడూ - స్ఫూర్తి - తరాజు

రాముడూ - పళ్ళు.

రాముని దాసులందరును రాజులె, నిక్కము భాగ్యరాజులే !!
రాముని సన్నుతించి కపిరాజుయు, త్యాగయ, నాగరాజులున్,
రామ రథంబునౌచు ఖగరాజు, హయమ్ము, మృగాధి రాజులున్,
ఈ మహిలోన 'రాజు 'లన నింత యశంబు గడించిరంట ! నా
నామము గూడ రాజె! మరి నన్నెటు బ్రోచెదొ? ఎట్లు గాచెదో ??

చింతలన్ని "గొలుసు" చిక్కులై తూగాడు,
పక్షపాతి "ముల్లు" ఫలిత మిచ్చు !!
"పళ్ళెరద్వయంబు" పనికిరాదాయెనా ?
మిమ్ము గొలుచు భాగ్యమీయలేవె?

పూజ చేయలేను ! పుష్పాలు తేలేను !
బొజ్జ నింపలేను బువ్వ తోడ !!
మనసు తెలుపలేను ! మాటాడగాలేను !
ఇట్టి జన్మ మిస్తివెందుకయ్య !!!

ధరణి పైన నెల్ల ధర్మంబు రూపుగా
అవతరించి నట్టి అమృత మూర్తి,
ఏమొసంగ గలను? ఏరీతి సేవించి
అమరమైన యశము నరయ గలను?

అనుచు తలచి, దు:ఖమతిశయించగ "త్రాసు"
మథనపడ దొడంగె మనసులోన.
"త్రాసు"అంతరంగ మవలోకనము జేసి
హృదయనాథు డాదరమున పల్కె !!

"ఆడుదానిహత్య, అడవిలో కపిహత్య
నేరమనుచు నిశ్చయించి జనులు
శబరి కోర్కె తీర్ప; శరభంగు తరియింప
ధర్మ మంచు తలపదగునె? చెపుమ?

తప్పు ఒప్పులనుచు తర్కింప పనిలేదు
ధర్మ విహితమెల్ల తనకు "నొప్పు"
ధర్మ రహితమెల్ల "తప్పౌను", పరికింప
కర్మ మొకటె నిజము, కర్త సాక్షి !

కర్మసాక్షి వౌచు కరుణతో ధర్మమ్ము
తీర్పులిచ్చి గొడవ తీర్చువేళ
ఇట్టి ధర్మ సూక్ష్మ మిలలోన ప్రసరింప
జేయగలవు, 'నన్ను' చేరగలవు !!

మంచి చెడుల మీద మనసునిల్పితిరేని
'నన్ను ' తెలియ లేరు, నరులు, మునులు
మంచిచెడుల ధర్మ మర్మంబు తెలుయుటే
'నన్ను' తెలుసుకొనుట, నడచు కొనుట !!

అని వచించె రాము"డంచేత ధర్మాస
నంబొసంగ సాగె నమ్మకమ్ము !!
ఇద్ధరిత్రి పైన నిదె కారణమ్మహో !
అతిశయోక్తి కాదు, ధర్మ మూర్తి !!.

ధర్మ నిరతి నెరిపి ధరణితలమ్ముపై
రామ రాజ్య ఫలము రంగరించి
సగుణ మార్గ మిచ్చి, సత్య నిష్ఠత నేర్పి
తత్త్వమంద జేసె త్రాసు ముల్లు.

స్ఫూర్తి:
(1) భైరవభట్ల కామేశ్వర రావు గారు "తన తనా తనన తనా" అనుకుంటూ ప్రశ్న వేస్తున్నప్పుడు సుప్రభాతం లో "నాగాధి రాజ గజరాజ హయాధి రాజాః" అన్న శ్లోకం గుర్తొచ్చింది.. అందరూ రాజులే కావాల్సి వచారే.. అందుకే కీర్తనలకి కూడా త్యాగ 'రాజే' కావాలనుకున్నట్టున్నాడు.కొంపతీసి ఆయనక్కూడా వర్గపట్టింపూ, గట్రా ఉన్నయా ఏమిటి? అని డౌటు వచ్చింది. మరి నాసంగతెట్టా? నా పేరు లో రాజు లేదే అని ఒక భావన వచ్చింది.. అంతలోనే మదిలో మెదిలింది ఈ తరాజు.

(2) జీవితంలో ఒడిదుడుకులు, సుఖ దుఃఖాలు కలుగుతూంటే... రెండిట్లోనూ నన్ను చూడమని రాముడు చెబుతున్నాడేమో అనిపించింది. సుఖానికి పొంగిపోవటం, దుఃఖానికి క్రుంగిపోవటం కన్నా మధ్యస్థం గా ఉండాలి అని భావన వచ్చినప్పుడు త్రాసు గుర్తుకు రావటం, త్రాసుతోనే న్యాయస్థానమూ.. దానితోటే ధర్మాసనమూ గుర్తుకు వచ్చాయి. న్యాయస్థానమూ, ధర్మాసనం అనీ ఎందుకన్నారు? ధర్మస్థానమూ, న్యాయాసనమూ అని ఎందుకనలేదు చెప్మా అని ఆలోచిస్తున్నప్పుడు కలిగిన భావన. రాముడు నదచి చూపినది ధర్మం... రాముడి సమదృష్టిని నిర్వచించగలిగేది త్రాసు మాత్రమే. ధర్మమాధారంగా న్యాయ నిర్ణయం చేయటం, "వామాంకస్థిత" అన్నట్లుగా త్రాసు ప్రక్కనుండగా, దాని స్ఫూర్తితో తీర్పునిచ్చేది ధర్మాసనం అని తట్టిన భావన.

Wednesday, September 30, 2009

ప్రారబ్ధం- స్వేఛ్ఛా - పరేఛ్ఛా

వర్షం పడ్డ సాయంత్రం వేడి వేడి మిరపకాయి బజ్జీలు ఉల్లిపాయ ముక్కలతోనో, అల్లం చెట్నీతోనో తింటూంటే ఉండే మజా అదోటైపు. స్నేహితుడొకరితో దాన్ని ఆస్వాదిస్తూంటే మాటల మధ్య రెండు పదాలు వాడాడు "స్వేఛ్ఛా ప్రారబ్ధం - పరేఛ్ఛా ప్రారబ్ధం" అని. అప్పటి దాకా ఖర్మ కాలి ఇల్లా అఘోరిస్తున్నా అని అనేటప్పుడు అవి మూడు రకాలే అనుకున్నా ... ప్రారభ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని. ఇప్పుడు వాటిల్లో సబ్ డివిజన్లు చెప్పాడు. ప్రారభ్ధాల్లో రెండు రకాలుంటాయి కాబోలు అని అప్పుడే తెలిసింది. తేడా ఏమిటిట అంటే రుచి బాగుంది కదా అని జిహ్వ చాపల్యం ఆపుకోలేక మిరపకాయ బజ్జీలు 4-5 తనంత తాను కోరుకుని తిన్నప్పుడు కడుపులో తేడాచేస్తే అది స్వేచ్చా ప్రారబ్ధంట. అదే ఇంకొకడి బలవంతం మీద మొహమాటానికి తనకి పడదని తెలిసినా బజ్జీలు తిని తేడా చేయించుకోవటం పరేచ్చా ప్రారబ్ధం అన్నాడు.

చెప్పింది ఏదో బానేఉన్నట్టు ఉన్నా నాకు రెంటికీ మధ్య తేడా అయితే అర్ధం కాలేదు. చిక్కు ఎక్కడొచ్చిందంటే స్వానుభవం లో స్వేచ్చా ప్రారబ్ధం మనకి తెలియకుండానే పరేచ్చా ప్రారబ్ధం గా మారిపోతూంటుంది. చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీచెయ్యలేం అనిపిస్తూంటుంది (నా లాంటి సగటు వ్యక్తికి).

ఉదాహరణకి:
హైదరాబాదులో సాప్ట్వేరు ఆఫీసుల చుట్టూ తెగ తిరుగుతూంటారు ఈ క్రెడిట్ కార్డిస్తాం, ఈ మొబైలు కనెక్షనిస్తాం.. ఎక్కడికీ వెళ్ళక్కర్లేకుండా మీ ఆఫీసు దగ్గరే ఇస్తాం.. మీరు అర్ధరాత్రి రమ్మన్నా అపరాత్రి రమ్మన్నా వస్తాం అంటారు. అనటమే కాదు వచ్చి మనకి అంటగట్టే వరకూ నిద్రపోరు. నెల నెలా డబ్బులు తీసుకోవటానికి కూడా కాబూలీ వాలాలు కూడా ఠంచను గా ఆఫీసుకు వచ్చేస్తారు ఏ సమయానికంటే ఆ సమయానికి. అదే కనెక్షను తీసెయ్యలి అంటే మీరు మా అఫీసుకి రండి. అదీ ఉ:- 10:30 నుండీ సా:- 4:30 లోపు అంటారు. అర్ధరాత్రి అపరాత్రి ఆఫీసులో నే వేళ్ళాడే సాఫ్ట్వేర్ వాలాలకు వెళ్ళటానికి తీరిక, ఓపికా ఎక్కడేడుస్తాయి? తీరా వెళ్ళేప్పటికి పుణ్య కాలం కాస్తా అయిపోతుంది. ఇప్పుడు ఆ మొబైలు కనెక్షను తీసుకోవటం ఏ రకమైన ప్రారబ్ధం?

ఇంకొకటి:
మా బస్తీకి ఎమ్మెల్యే ని ఎంచుకోవటం స్వేచ్చా ప్రరబ్ధమా? పరేచ్చా ప్రారబ్ధమా? నేనొకడికి ఓటేస్తే ఇంకొకడు గెలిస్తే అప్పుడు నా స్వేచ్చ ఎమయినట్టు? పోనీ తీరా ఏదో ఒక సదుద్దేశం తో ఒక మంచివాణ్ణే మేమందరం ఎంచుకుంటే వాడికి బుద్ది మారిఫోయి గోడ దూకేస్తే అదేరకం? ఉన్నట్టుండి జగన్నామమో, ఇంకో నామమో చేస్తూ మన అందరి జీవితాలతో, భవిష్యత్తుతో ఆడుకునే నిర్ణయాలు చేస్తూంటే అది ఏరకం?

మరోటి:
రిజ 'ర్వేషాలు ', పురస్కార అవార్డులూ, కోర్టుల్లో కేసులూ, సీ.బీ.ఐ. దర్యాప్తులూ, వార్తా పత్రికల్లో కథనాలు వీటన్నిట్లో విశ్వసనీయత, సత్యాసత్యాలు, ఆవస్యకతలూ ఎంత మేర? దానిని పెంపొందిచటం/ నిలువరించటం లో మన ప్రమేయం, పాత్రా, సమర్ధత ఇవి స్వేచ్చా ప్రారబ్ధమా? పరేచ్చా ప్రారబ్ధమా?

ప్రశ్నల్ని పక్కనపెడితే వీటికి సొల్యూషనులేమిటి? మన బ్రతుకు, మన నిర్ణయాధికారం, మన స్వేచ్చా మనకి నిలబడాలంటే దారేది? ఈసురోమని బతుకెళ్ళదీయటమేనా? వేరే దారిలేదా?

"అర్ధరాత్రి స్త్రీ స్వేచ్చగా నడిరోడ్డు మీద నిర్భయంగా తిరిగగలిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు" అన్న మహాత్మా... ప్రారబ్ధాన్ని మార్చుకోటానికి, జీవితాన్ని బాగుచేసుకోటానికి, స్వేచ్చగా బ్రతకటానికీ దారి నీకేమైనా తెలుసా?

తెలిస్తే చెప్పవూ.. ప్లీజ్..

Wednesday, September 9, 2009

జనం-ప్రభంజనం

ఏదో తరుముకొస్తున్నవాడికి మల్లే మురళీ ఇంట్లోంచి బయట పడ్డాడు. ఆలోచనల్నుంచీ దూరంగా వెళ్ళడానికి ప్రయత్నమన్నట్టు సింబాలిక్ గా విశాఖ నగర వీధులన్నీ బండి మీద చుట్టేసి చివరికి బీచొడ్డుకి చేరాడు. సాయంత్రం ఔతోందేమో పిల్లలు స్కూళ్ళనుండీ, ఉద్యోగులు ఆఫీసుల్నుండీ బిలబిలమంటూ బస్టాపుల్లో చేరుతున్నారు. మురళికి ఇవేవీ పట్టటం లేదు.

దురదృష్టవశాత్తూ ప్రముఖ నాయకుడు అకాలమరణం చెందటం, గొప్ప నేతను పోగొట్టుకున్నామే అని ఆంధ్రదేశం ఒకవైపు దుఃఖ సాగరంలో మునిగిపోవటం, దాన్లోనుంచీ తేలిగ్గా సామాన్య ప్రజానీకం బయటపడదేమో అన్న జాలితో (ఉరఫ్) కరుణతో, వారి అనుచరగణం అనుకునే కొందరు అభిమానులు ఆయన పార్థివ దేహం కూడా రాకముందే సంతకాలు సేకరణ, ప్లకార్డులూ అంటూ ఇంకొకవైపు కోలాహలం చేయటం, ముణ్ణాల్గు రోజులుగా ఏ టీ.వీ చానెల్ చూసినా ఒకటే వార్త, అదీ బ్రేకింగు న్యూసు అనుకుంటూ.. ఎవరు ఎవరిపై ఎప్పుడు ఎలా ఒత్తిడి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారూ, ఎవరెవర్ని కలిశారు, ఏ ఇద్దరి మధ్య ప్రైవేటు సంభాషణ ఏమయ్యుంటుంది అన్న ఊహాగానాలూ, చర్చలూ, రాజకీయ వాతావరణం ఎన్ని డిగ్రీలు వేడెక్కిందీ అని ఊదరగొట్టెయ్యటం తో అసలే కకావికలై ఉన్న మనస్సుకి కూసింత విశ్రాంతి కావాలనుకుంటూ మురళీ బీచొడ్డున ఉన్న తెన్నేటి పార్కు దగ్గర బెంచీ మీద చతికిల పడ్డాడు.

జేబులో నుండీ మొబైల్ ఫోను తీసి వివిధభారతి ఎఫ్.ఎం. ట్యూను చేసి ఇయర్ ఫోన్లు తగిలించుకున్నాడు. లలిత సంగీతం గాబోలు మంద్రం గా వినిపిస్తోంది.చల్లని గాలి తెమ్మరలు వీస్తూంటే పాటనీ, వాతావరణాన్నీ ఆస్వాదిస్తూ ఎప్పుడు నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడో తనకే తెలీదు.

తనేదో అడవిలో నడుచుంటూ వెళ్తూంటే ఎక్కడినుంచో ఒక పరిచయం ఉన్న గొంతు వినిపిస్తోంది. అన్నయ్యా నమస్తే, చెల్లమ్మా నమస్తె.. ఔను కదూ ఇది మన ప్రియతమ నాయకుడిదే... నడకవేగం పెంచా.. శభ్దం వస్తున్న దిశగా.. లోపల ఏదో బలమైన ఆశ... ఏదో తెలియని ఉద్విగ్నత...కాళ్ళకి రాళ్ళూ, రప్పలూ ఎవీ పట్టట్లేదు..కళ్ళు మాత్రం చెవులతో అనుసంధానం అయిపోయి అన్వేషణ సాగిస్తున్నయి.. ఎక్కడనుండీ ఆ పిలుపు?? మనస్సు పరిపరి విధాల ఆలోచనల్ని చేస్తోంది..

ఇది కలా నిజమా ?? డౌటు రాగానే నడక ఠపీమని ఆగిపోయింది.

ఒక్క క్షణం నన్ను నేను గిల్లుకుని చూశా. అబ్బ... నొప్పి పుట్టింది. అయితే నిజమే... ఎందుకైనా మంచిది అని చుట్టూ చూశా. నాలానే చుట్టూ చాలా మంది ఉన్నారు. అటూ ఇటూ హడావుడిగా పరిగెడుతున్నారు. అందరి మొహాల్లోనూ ఏదో ఆందోళన, ఏదో తాపత్రయం కనిపిస్తోంది. సందేహ నివృత్తి చేసుకుందామని ఒకణ్ణి అడిగా, ఏమిటి సంగతి అని. వాడొక క్వొశ్చెన్ మార్కు ఫేసుతో చూశాడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ట్రై చేశా.. నాకొచ్చినవి ఆ మూడే మరి..ఊహూ. ఏం లాభం లేకపోయింది... వాడికి అర్ధమయ్యీ చెప్పట్లేదా? నా భాషే అర్ధం కావట్లేదా?..కొంపతీసి తమిళమో/ మళయాళమో/ ఒరియానో కాదు కదా? ఔనూ మన నాయకుడికి కూడా ఇటువంటి పరిస్థితే ఎదురయ్యి ఉంటే..

అమ్మో...ఒక్కసారి వెన్ను లో జలదరింపు....

అయ్యుండదులే అని నాకు నేనే భరోసా.. ఇంతలోనే మళ్ళీ ప్రశ్నలు...

ఔనూ నేనున్నది ఏ ప్రాంతం అడవి? మొబైల్ తీసి జి.పి.ఆర్.ఎస్ చూడాలా? నేనసలు అడవిలో ఎందుకున్నా? ఎక్కడకి వెళ్తున్నా??.....పుట్టలోంచి పాములొస్తున్నట్టు ఆలోచనలు దొంతర్లు దొంతర్లు గా వచ్చేస్తున్నై...

అంతలోనే మళ్ళీ స్వరం వినిపించింది...నమస్తే.. నమస్తే.. ...వెనక ఎక్కణ్ణుంచో..

అనవసరంగా ఆగానే అనిపించి మళ్ళీ నడకందుకున్నా... దగ్గరౌతున్నకొద్దీ మరింత స్పష్టంగా వినిపించసాగింది... నడక పరుగయ్యింది....దార్లో తుమ్మ చెట్లూ, వాగులూ, వంకలూ ఏవీ నాకడ్డుగా అనిపించలేదెందుకనో... పరిగెత్తటం వల్లనో.. లేక మనస్సులో ఆందోళన వల్లనో.. గుండె వేగంగా కొట్టుకోసాగింది..

కాళ్ళైతే దగ్గరికి తీస్కెళ్తున్నాయన్న మాటే గానీ వింత వింత ఆలోచనలు అమాంతం నామీద దాడి చేసేస్తూనే ఉన్నయి. టీ.వీ విపరీతం గా చూసేసిన ఫలితంగానో ఏమో గానీ.. ఆయన కనిపించగానే నా రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆశ్చర్యమా..? ఉద్వేగమా..? ఆనందమా...? దుఃఖమా..? ఏమో... ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తూంటే. పంచుకోటానికి సరైన తోడు లేదే.. ఎవరికైనా ఫొన్ చేసి చెప్పనా? ఇంటర్వ్యూ చేసేసి దాన్ని ఏ టీ.వీ పంధొమ్మిదికో, నక్షత్రా టీ.వీ కో పంపెయ్యనా.. రెండుమూడు క్లోజప్ ఫోటోలు దిగి న్యూస్పేపరోళ్ళకి ఇచ్చేసుకోనా....సెల్ ఫోనులో పిక్చర్లు తియ్యనా..?

ఖస్స్...ముల్లొకటి కాల్లోకి దిగటంతోనే మళ్ళీ ఈ లోకం లోకి వచ్చా.. అనుచరుణ్ణి అనుకుంటూనే పిచ్చి పిచ్చి పోకడలకి పోవటం నాకె వింతగా అనిపించినై.

అలోచనలు ఇంకో రూట్లో వెళ్ళిపోసాగాయి.. నాయకుడు ఏమయ్యిందీ 18 గంటలయ్యినా ఇంకా ఎవరికీ అంతు చిక్కలేదు. అసలు ఇంటెలిజెన్సు, భద్రతా సిబ్బందీ, అధికారులూ ఏంచేస్తున్నట్టు? కాలక్షేపానికి టీ.వీ.కి అతుక్కుపోయారేమో అనుకోటానికి కనీసం ఐ.పి.ఎల్ మాచులు గానీ.. శాసన సభా ప్రసారాలు కానీ లేవే.. అయినా ఆ ఎగిరే విమానమో, హెలికాప్టరో ఇంగ్లీషు సినిమాలోలాగా రోడ్డు మార్గానికి పైనే ఎగరచ్చుగా? అడ్డం పడి అడవులమ్మట పోకపోతే నష్టమేమిటి? ఒక ఆర్.టీ. ఐ. ఫైలు చెసి పాడేద్దాం.. ఒక ముఖ్య అధికారి టూరుప్రోగ్రాం ఔతూంటే విధినిర్వహణ లో ఎన్నిసార్లు ఎంతమంది ఎలా తప్పులు చేసారు? ఇకపై అలా జరక్కుండా ఉండాలంటే తీస్కుంటున్న జాగ్రత్తలేమిటి? ఒక ఇరవై రూపాయల్తో ఆర్.టీ. ఐ. వేసేస్తే సరి. తలా తోకా లేకుండా ఉన్న ఆలోచనలతో ఆవేశంగా ఊగిపోతున్నా...

సౌండు మరింత దగ్గరయ్యింది. కనుచూపు మేరలో ఒక పెంకుటిల్లు ...దాని బయట చప్టా చేసిన అరుగు, రెండు మూడు బెంచీలు.. వేలాడుతున్న లాంతర్లు...కనిపించినై

మిణుకు మిణుకు మంటున్న ఆశ కాస్తా గుండెకిమల్లే లబ్-డబ్, లబ్-డబ్ అని కొట్టుకోసాగింది... కొంపతీసి అది అన్నలో తమ్ముళ్ళో ఉండె ఇల్లుగానీ కాదుకదా.. అప్పటిదాకా రాని ఆ ఊహ అప్పుడే రావటంతో గుండె ఒక సెంటీమీటరు కిందకి జారినట్టయ్యింది. ఇంట్లో మా అవ్వ, మా ఆవిడ, మా బుడ్డోడు, ఊర్లో ఉండే మా అమ్మ, నాన్న గుర్తొచ్చారు. గాలొస్తే ఎగిరిపోయే రూపం నాది, నాకెందుకొచ్చిన ఆత్రం??? పిరికిదనం విశ్వరూపసందర్శన యోగం ఇవ్వటంతో వళ్లంతా ముచ్చెమటలు పట్టేశాయి. నాలుక తడార్చుకు పోయింది.

అంతలోనే గంభీరమైన గొంతు.. నమస్తే.. నమస్తే.. అన్నయ్యా నమస్తే, చెల్లమ్మా నమస్తె.. నమస్తే.. నమస్తే..

ఇక ఉండబట్టలేక ధైర్యం చేసి ఉదుక్కున ఆ పెంకుటింట్లోకి దూరా. అక్కడున్నది చూసి ఒక్కసారి అవాక్కయ్య..

మహానాయకుడి ఎన్నికలలో మాటల్ని అదేదో టీ.వీ. లో పదే పదే వినిపిస్తున్నారు. నమస్తే.. నమస్తే.. అన్నయ్యా నమస్తే, చెల్లమ్మా నమస్తె.. నమస్తే.. నమస్తే.. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం, ఆనందం ఒక్కసారి ఉస్సూరుమని పోయాయి. అయ్యో.. ఎంత ఊహించుకుంటూ వచ్చానో, పడ్డ శ్రమంతా వృధా ప్రయాస అయ్యిందే... నిస్సత్తువ వళ్లంతా పాకింది.

టీ.వీ. మాత్రం నిరాటంకంగా ప్రసారం చేస్తూనే ఉంది..

అప్పుడప్పుడు ఆవేశపరుల్ని, కొన్నిసార్లు ఆచరణపరుల్ని చూపిస్తూ మధ్యమధ్య నాయకుడి ఫోటోల్నీ, చరిత్రనీ, చేసిన సేవనీ తిప్పి తిప్పి చూపిస్తున్నారు. ఇంతలో జనం నాడి తెలుసుకుందాం రమ్మంటూ అక్కడ ఉన్న జనవాహినికి మైకందించింది రిపోర్టరమ్మ. "ఏ విధంగా మన ప్రియతమ నేత ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దామనుకుంటున్నారు" అమాయకం గా అడుగుతోంది రిపోర్టరమ్మ.

"అడవిలో స్మారక స్థూపం కట్టించాలి" ఒక యువనేత నినాదం.
"అడవుల్ని కొట్టించి మంచి రోడ్డు వేయిస్తే ఇకపై అట్లాంటి ప్రమాదాలు జరగవు. మేఘాలూ రావు కాబట్టి దారికనిపించకపోయే చాన్సే లేదు" ఇంకొకళ్ళు దాన్నే బలపర్చారు.
"ఒకవేళ దురదృష్టవశాత్తూ ప్రమాదం లాంటిదేమైనా జరిగినా ప్రమాదస్థలి చేరుకోటానికి ఆలస్యం జరగదు." మరొకళ్ళు గొంతు కలిపారు.
ఒకళ్ళిద్దరికి ఎవో ధర్మ సందేహాలొస్తున్నట్టున్నాయి.. 'స్థూపం వద్ద ...మరి... రక్షణ...." మధ్యలోనే అందుకున్నారు మరొక వృధ్ధనేత. "దారి వెయ్యటం వల్ల స్తూపం వద్ద అశెష ప్రజానీకం పూజలూ చేసుకోవచ్చు" "ఆ కొట్టించిన అడవి స్థానం లో ఆవాస్ యోజన ఇళ్ళు వగైరా కట్టిస్తే ఆయన పేరు చెప్పుకుని గిరిజనులూ, ఆయన అభిమానులూ నివాసం ఏర్పరచుకుని జీవనం సాగిస్తారు" ఇంకొక వీరాభిమాని నినాదం...జనం చప్పట్లలో ఒక మంత్రివర్యులు కళ్ళు తుడుచుకుంటూ అందుకున్నారు "అలా చెయ్యటం వల్ల అక్కడకి భవనాలు, వసతులూ, మంచి నీరు, ఆరోగ్యం.. పరిశ్రమలూ అన్నీ ఏర్పడతాయి. సెల్ ఫోన్లూ, ఇంటర్నెట్టూ ఒకటేమిటి ఈ ప్రాంతం రూపు రేఖలే మారిపోతాయి".. అందరూ అంగీకరిస్తున్నట్టు కరతాళధ్వనులు...

ఈ వర్గం వాళ్ళు ఇల్లా టీ.వీ. లో పంచవర్ష ప్రణాళికలు వేయటం పక్కనే ఉన్న ఇంకొక వర్గం వాళ్ళకి అంతగా రుచించలే. "మన నాయకుడికి పద్మశ్రీ ప్రకటించాలి". వాళ్ళల్లో ఉన్న ఒక పండుటాకు అంది. "ఒక్క పద్మశ్రీ ఏమిటి? ఒకేసినిమాని అన్ని అవార్డులూ వరించినట్టు, ఈ సంవత్సరం పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వగైరా అన్నీ ప్రకటించాలి" ఆ నాయకుడి అనుచరగణం లో ఒక ఉడుకు రక్తం గొంతెత్తింది. "అంతే కాదు. అర్జున, ద్రోణాచార్యలతో పాటూ ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న కూడా ప్రదానం చెయ్యలి" కోరుకున్నాడో ప్రభు భక్తి పరాయణుడు. ఇక్కడా దాదాపు ఏకాభిప్రాయం సాధిస్తున్నట్టే కనిపిస్తోంది.. కరతాళధ్వనులు మిన్నంటాయి.

ఇంకొక వర్గం ఇంక ఇల్లా లాభంలేదనుకుని జయజయధ్వానాలు ఎత్తుకుంటున్నాయి. కెమేరా అప్పటికి గానీ వాళ్ళని క్లోజప్ లో చూపించలేదు మరి. "ఆ మహాత్ముడు చూపించిన దారే మా ముందున్న కర్తవ్యం. ఆయన కన్న కలల్ని సాకారం చేస్తాం అదే ఆయనకు మా నివాళి. కాకపోతే అది మా అంతట మేం చెయ్యలేం. ఫలానా వాళ్ళు మాత్రమే మాకు దారి చూపించగలరు. అప్పుడు మాత్రమే మేము ఇవన్నీ చెయ్యగలం. లేకపోతే మమ్మల్ని మేము నాశనం చేసేకుంటాం... ఉద్యోగాలకీ, పదవులకీ, జీవితాలకీ రాజీనామా చేసేస్తాం..." ముక్తకంఠం తో అన్నారు. అందరూ ఒకేసారి ఒకే మాడ్యులేషన్ తో ఒకే మాటని అనగలగటం ఖచ్చితం గా ఒక కళే. ఉన్నట్టుండీ వాతావరణం రాజుకుంది..

అప్పటిదాకా బరువెక్కిన గుండెలతో భోరుమన్న ప్రదేశం కాస్తా జయజయ ధ్వానాలతో ఎన్నికల వాతావరణాన్ని మరిపించింది. పొందిన సాయానికి కృతజ్ఞతగా ఆ మహాత్ముణ్ణి కడసారి దర్శించుకుందామని వచ్చిన పేదావాళ్ళతో పాటూ టీ.వీ లోఈ తతంగం చూస్తున్న నాకు కళ్ళు తిరగసాగాయి. ఎవరో మొహమీద నీళ్ళు చిలకరిస్తున్నట్టు లీలగా గుర్తు.

ఉలిక్కి పడి కళ్ళు తెరిస్తే నీళ్ళు చిలకరించటం కాదు గుమ్మరిస్తున్నట్టుగా వర్షం. అప్పటికి గానీ మురళి ఈ లోకంలోకి రాలేదు. అందరిలాగే తనూ ఒక చెట్టు నీడకి పరుగెత్తాడు.

Monday, September 7, 2009

మా బుడుగు కవితోపాఖ్యానం



ప్రతి రోజూ ఉదయం ఏవో శ్లోకాలూ, పద్యాలూ చదువుతూ మా బుడుగుని నిద్ర లేపటం మా ఆవిడకీ, పడుకునేటప్పుడు పద్యాలు చదివించుకుంటూ పడుకోవటం నాకూ అలవాటు. మా నాన్నగారు మాతో అలాచేస్తూండేవారు.

ఆస్ట్రేలియా కాలమానానికి ఊడిగం చలవా అని,బ్రాహ్మీ ముహూర్తం నుండీ నేనూ నా లాప్ టాపు బిజీ అయిపోయి, మా వాడిని నిద్ర లేపి చాల కాలమే అయిపోయింది. ఆ మధ్య డే లైట్ సేవింగు అయిపోయిన సందర్భంలో ఒకానొక శుభదినాన మావాడిని నిద్ర లేపే భాగ్యం నాకు దక్కింది, అదీ తెల్లవారి 7 దాటినతర్వాతే. మెలకువ వచ్చేసినా ఇంకా పక్క మీద దొర్లుతూనే ఉన్నడు. నిద్రలేమ్మా అని నేను యధావిధిగా సుప్రభాతం మొదలెట్టా.

వాడు కళ్ళుమూసుకునే 'నేన్చెప్తా..నేన్చెప్తా ' అని అందుకున్నాడు.

"లావణ్యా సుప్రజా సనందన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే !
ఉత్తిష్ఠ 'బుల్లి శార్దూలా' కర్తవ్యం దైవమాహ్నికం. "

హాశ్చర్యపోయా నేను. కౌసల్య కి బదులు లావణ్య అనటం కాదు నరశార్దూలా కి బదులు బుల్లి శార్దూల అనటం నాకు నిఝ్ఝంగా హాశ్చర్యాన్నే కలిగించింది - బహుశా మా ఆవిడ నేర్పించి ఉంటుందేమో అనుకున్నా.

అంతకంటే షాకు తర్వాతి పద్యంలో ఇచ్చాడు.

ఉత్తిష్ఠోత్తిష్ఠ 'పండమ్మా' ఉత్తిష్ఠ 'కన్నవాడు '
ఉత్తిష్ఠ 'అల్లరి బుంటీ' త్రైలోక్యం మంగళం 'కురు కురే'.

షాకుకి కారణాలు రెండు.
(1)వీడికి ఇల్లా మార్చుకోవటం ఎల్లా తెలుసా అని.(వాడి అసలు పేరు కృష్ణ సనందన్. అయితే అక్కడ వాడినవన్నీ వాణ్ణి తనూ, మా అమ్మ, నేను పిలిచే ముద్దు పేర్లు)
(2)ఆఖర్లో కుర్కురే అన్నాడేంటి అని.

నేనింక ఉండబట్టలేక అడిగేశా 'ఎవరు చెప్పార్రా నీకిది అని '. నేనే చెప్పా అన్నాడు. నమ్మకం కుదర్లే. మా ఆవిడని అడిగా. విషయం విని తను నాకన్నా బోల్డంత హాశ్చర్యపోయింది. వచ్చి ముద్దులు పెట్టేసుకుంటూంటే అడిగా వీడికి మీనింగు ఎవన్నా నువ్వు చెప్పావా అన్నా.. 'అవునూ అంది. వాడు మీనింగు అడిగితే గోవిందా అన్నా, గరుడధ్వజా అన్నా, కమలాకాంతా అన్నా అన్నీ వెంకటేశ్వర స్వామి పేర్లే అని చెప్పా అంది. వాడికి వాడు అన్వయించుకోవటం ముచ్చతేసింది.

మరి ఆఖర్లో కుర్ కురే ఏమిటి అన్నా.. ఏమో అది నాకు తెలీదు అది మాత్రం వాడి పైత్యమే అంది.

ఈ పద్యం మీనింగు ఏంటి నాన్నా అన్నా..వాడు మూతి బాగా తిప్పుతూ అన్నాడూ..
"అమ్మ, నాన్న, బామ్మ సనందన్ ని నిద్రలేపుతున్నారూ.. తెల్లారిపోయిందీ...సూర్య భగవానుడొచ్చేశాడూ.., లేచి కుర్కురే తిందువుగాని లే అని అంటున్నారూ " అని.

మనీ సినిమాలో బ్రహ్మానందం స్టైల్ లో కిందపడి కొట్టుకోవటం ఒక్కటే తరువాయి నాకు.

Tuesday, August 25, 2009

మా తాతగారి కబుర్లు...



"చిత్ర రచన అక్షర లక్షల జపంతో సమానం", "చిత్ర కళే-లక్ష్మీ కళ. లక్ష్మీ కళే-చిత్ర కళ." అని నిర్వచించటమే కాక, దాన్నే శ్వాశించి, జీవించిన వారు మా తాతగారు..శ్రీ శ్రీపతి శ్రీధర స్వామి.

ప్రత్యేకించి ఆయన ప్రస్తావన ఇక్కడ తీసుకురావటానికి కారణం - ఋషిపంచమి - వారి జన్మదినం. ఆయన అసలు పేరు శ్రీధర్. స్వాతి మాసపత్రికలో వస్తున్న 'కోతి కొమ్మచ్చీ లో ముళ్ళపూడి వెంకట రమణ గారు తొలినాళ్ళ లో తనకు ఈ 'శ్రీధర్ ' ఎలా సహాయం గా నిలబడి చేయూత నందించారో కూడా చక్కని మాటల్లో వెలిబుచ్చారు. ముళ్లపూడికి వరసకి అన్నయ్య మా తాతగారు. (పెద్దతల్లి, పినతల్లి బిడ్డలు)

మా తాతగారికి నలుగురు సంతానం, ఆపై భార్యా వియోగం. పిల్లల్ని తల్లీ తండ్రీ తానే అయి పెంచారు. అందరి లానే పొట్టకూటికి కొసం ఎవో పనులు చేసుకుంటూంటే ఇక కధేముంది? నడిచేదైవం, కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఒకసారి తిరుపతిలో మా తాతగారిని చూసి "నువ్వు కారణ జన్ముడివి. దైవ సమర్పణం గా జీవితాన్ని కొనసాగించు, ఇక పై నీ పేరు శ్రీధర స్వామి అన్నారుట." ఆయన ఆశీర్వాద బలంతో, అఖండజ్యోతీ దీపరాధన శక్తితో, పద్ధెనిమిది సంవత్సరముల (18 yrs) మౌనవ్రత దీక్షతో వెయ్యిన్నీ యాభై 1050 తైల వర్ణ చిత్రాలు రచించారు శ్రీధరస్వామి గారు. వెంకటేశ్వర సుప్రభాతం, కనకధారాస్తోత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలు, వాల్మీకి రామాయణం, కృష్ణలీలలు. ఇలా అయిదు విభాగాల్లో ఆయన అశేషమైన కృషి చేసారు.

పాత కాలం "వెంకటేశ్వరవైభవం" సినిమా ఎవరికైనా గుర్తుండి ఉంటే అందులో స్వామి వారి సుప్రభాతం జరిగినప్పుడు చూపించిన తైల వర్ణ చిత్రాలు వారు రచించినవే. దాదాపు 25-30 ఏళ్ళ క్రితం గుంటూరు, భీమవరం, మద్రాసు టి.టి.డి. కళ్యాణ మండపాలలో కూడా ఆయన చిత్రాలు అలంకరింపబడి ఉండేవి. ఈ మధ్య కాలం లో (1992-95 మధ్య) ప్రతీ శనివారం ఉదయం 6 గం.ల నుండీ 6:30 వరకూ జెమినీ టీవీలో వెంకటేశ్వర సుప్రభాతానికి అర్ధ భావ వివరణ వచ్చేది.

ఆ చిత్రాలకు మా తండ్రి గారు శ్రీపతి రఘురామ కుమార్ గారూ, మా బాబాయిలు జనార్ధన రావుగారు, సత్యాజీగారూ, బాలసుబ్రహ్మణ్యం గారూ వ్యాఖ్యానాన్ని వివిధ భాషల్లొ అందించేవారు.


రాష్రపతులూ, గవర్నర్లూ మొదలు వివిధ మఠాధిపతులూ, పీఠాధిపతులూ, కేంద్ర రాష్త్ర మంత్రులూ, సినీ ప్రముఖులూ...రాజకీయవేత్తలూ..., విద్యావేత్తలూ..., సంస్థలూ, స్కూళ్ళూ.. ఇట్లా యావత్భారత దేశం నలుమూలలా మాతృకళాకేంద్రం తరఫున ఈ ప్రదర్శనలనిస్తూ ధర్మ ప్రచారానికి తమవంతు కృషిని అందించి మన్నలను పొందారు. ఋషుల అంతరార్ధ విశేషార్ధాలనూ, సందర్భోచితంగా, ప్రాంతాలకనుగుణం గా తుకారము, నామదేవు, కబీరు, పురందరదాసు అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు వంటి వాగ్గేయ కారుల కృతులతో అన్వయిస్తూ తెలుగు, హింది, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మరాథీ, గుజరాతీ భాషల్లో వ్యాఖ్యానాన్ని చిత్రకారుల కుమారులు అందించేవారు.

77 సంవత్సరాలు ప్రాకృత శరీరం లో జీవించి, తన చిత్ర రచన ద్వారా యశః కాయులయ్యారు మా తాతగారు.

ఆయన చిత్రాలు, ప్రత్యేకించి ఈ క్రింది చిత్రం ఎన్నో ఇళ్ళల్లో నిత్యం ఇప్పటికీ పూజలందుకుంటూనే ఉంది.

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

అనే 28వ శ్లోకానికి వారు చేసిన చిత్ర రచన.


లక్ష్మికి నివాసస్థానమైన వాడా అన్నందుకు శ్రీవారి వక్షస్థలం లో అమ్మవారిని, వంకలేని గుణాలన్నిటికీ సముద్రము వంటివాడా అన్నందుకు సముద్రాన్ని, సంసారము అనే సాగరాన్ని దాటడానికి ఒకేఒక వంతెన వంటివాడా అన్నదుకు ఆ సముద్రం లో అలలవలే జీవులనూ వారి మధ్యనే నిలబడ్డ స్వామినీ, వేదాలకూ ఉపనిషత్తులకూ సారమైన ఓంకారం చే తెలియబడేవాడా అన్నందుకు ఓంకారాన్ని, సాలోక్య సారూప్య సామీప్యాలలో భక్తులచే కొలువబడేవాడా అన్నదుకు కాషాయం రంగులో ఒడ్డున ఉన్న భక్తులనూ, వేంకటాచలపతీ అన్నదుకు, స్వామివారి వెనుక తిరుచూర్ణం తో కూడిన సున్నపు రాయి కొండగానూ, సుప్రభాతం అన్నదుకు సూర్యోదయాన్ని సూచిస్తూ చిత్రీకరించారు.

ప్రస్తుతం ఈ దృశ్యశ్రావ్య ప్రదర్శనలను మా చిన్న బాబాయి బాలసుబ్రహ్మణ్యం గారు అందిస్తున్నారు. ఈ చిత్రకారుడి కళను తిలకిద్దామనుకునే ఆసక్తి కలవారు టపా వ్రాసి కానీ, ఫోను ద్వారా కానీ బాబాయిని సంప్రదించవచ్చు. 91 9347950531. sripathibs4@gmail.com

కొసమెరుపు: 12 సంవత్సరములుగా సంతానం కై ఎదురుచూస్తున్న మా సోదరి, సరిగ్గా ఋషిపంచమి నాడే పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ముత్తాతగారే మళ్ళీ వచ్చి నన్ను మేనమామను చేశారేమో అని డౌటు.మా తాతగారు చిరస్మరణీయులే కాదు, మాకు ప్రాత స్మరణీయులు కూడాను.

Thursday, August 13, 2009

మా బుడుగు - నా స్ఫూర్తి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సమయాభావము చేతను
సమయానికి ఇతర జనుల సందడి చేతన్
కమనీయంబౌ భావము
గమనించియు బ్లాగలేని గతి గలిగెను! హా !!

కొన్నాళ్ళోపిక పడదా
మన్నా మనసొప్పలేదు, మారము జేయన్
విన్నాడేమో నా మొర
అన్నట్లుగ సంఘటనలు అగుపడ జేసెన్

పిల్లవాడు పాఠ మెల్లకంఠస్థంబు
చేసి గూడ తప్పు జెప్పుచుండె.
పక్కనున్నవారు పలుమారలందింప
తడవ తడవ కిట్లు తడుము కొనెను
ఏమటంచు నడుగ "నేదేని వాక్యమ్ము
నందజేయమనుచు" నతడు పల్కె
"చిన్ని సాయమిచ్చి చేయూత నందింప
పాఠ్య మొప్పజెప్పి పాడగలను."

దాన్ని జూడగానె తలపు లోపల చిన్న
మెరుపు మెరిసి నట్లు మిణుకు మనియె
రామ భావమిట్లు రమణీయతను గూడి
పద్య రూప మంది పల్లవించె.


"హనుమంతుడు హృదయములో
నిను చూపుటదేమి వింత? నిర్మల రూపా !!
నిను నా అత్మన్నిల్పితి !
కనుగొన నిదె గొప్ప వింత ! కాదందువటే !!

ఆత్మ జేరి మిమ్ము ఆరాధనముసేయ
దారి గోచరించ దాయె మాకు
ఒక్క సారి దారి చూపింపుమాపైన
అన్ని జూపగలము ఆత్మ నందు."

ఎట్టియోగమైన, ఏమార్గమైననూ
ఆత్మ నెరుగుమనును ఆర్తి తోడ.
తనను తాను తెలియ, తనలోని దైవమ్ము
తెలియు తెలివి తేట తెల్ల మగును

బడికి పో తలంచి బట్టీలు పడుతున్న
చిన్న వాణ్ణి జూడ చిత్తమందు
తత్వమిట్లు మెదలి తనువంత వ్యాపింప
మనసు పులకరించి మరులు పొందె

ఉన్నాడేమో అన్నిట !
కన్నాడేమో గుణాధికములౌ భావాల్
ఎన్నో దినముల ఎడబా
టిన్నాళ్ళకు తీర రాముడిట్లు స్ఫురించెన్ !!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


అనరే నీవే దిక్కని
చనరే వ్రజ సీమ, హృదయ చక్షుల తోడన్
కనరే మానస చోరుని
వినరే మురళీ రవమ్ము ! వేడ్కలు తీరన్

Monday, July 27, 2009

మా బుడుగు ప్రశ్నావళి.

అదేదో సినిమాలో బాబూ మోహన్ "ఎందుకు? ఏమిటి? ఎల్లా?" అని అడిగినట్టు నర్సరీలో జేరినప్పట్నుంచీ మా వాడి దగ్గర అమ్ములపొది బాగాచేరినట్టుంది. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించేస్తున్నాడు. అది మావరకూ ఉంటే సరేసరి. ఆ స్కూల్లో టీచర్లకి కూడా అంటించి వాళ్ళ దుంపతెంపుతున్నాట్ట. సరిగ్గా నెలరోజులయ్యింది స్కూలు కెళ్ళబట్టి. అప్పుడే టీచర్ల మీటింగు, అందులో వాళ్ళ పితూరీలు.

ముందుగా..
(1) అసలే "కాన్సెప్టు" స్కూలాయె. మాటలూ, ఆటలూ, ఇన్స్ట్రక్షన్సూ ఆంతా ఇంగ్లీషు లోనే. డోంట్ రన్, డోంట్ క్రై, డోంట్ డూ, |మొ|... కట్ చేస్తే, వీళ్ళకి క్లాసులో రైమ్స్ నేర్పిస్తున్నార్ట.

"లండన్ బ్రిడ్జీస్ ఫాల్లింగ్ డౌన్.. ఫాల్లింగ్ డౌన్..ఫాల్లింగ్ డౌన్."
"london bridge is falling down,.. falling down , falling down...."

నేర్పిస్తున్నంతలోనే మా వాడు అచ్చ తెలుగులోకి దిగిపోయాట్ట, భాష్యం చెప్పేయటానికి (స్కూల్లో టీ చర్లకే, అదీ వాళ్ళు అడక్కుండానే), "మాట వినకుండా పరిగెత్తింది లండన్ బ్రిడ్జి. అందుకే కింద పడ్పోయింది"...అంతే క్లాసు మొత్తం TIDE అవాక్కయారా అన్నట్టు నోరెళ్ళబెట్టేసారుట.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(2) స్కూల్లో పిల్లల్ని వాన్లో ఆడుకునే ప్లేసుకి తీసుకెళ్ళబోయార్ట ప్రిన్సిపాల్ గారు. ముందు సీట్లో వీడు ఇంకో ముగ్గురు పిల్లలు కూర్చున్నారుట. రోడ్డు మీద బండికి ఎవడో అడ్డంగా పరుగెత్తుకొచ్చేస్తూంటే, సడన్ బ్రేకు వేసి, ఒక్కసారి గయ్య్ మందిట ఆడ్డొచ్చినవాణ్ణి ఆవిడ.
అప్పుడు ఇదిట ఆవిడకీ, మా వాడికీ జరిగిన సంభాషణ.
వీడు :"ఎవరు వాడు"
ఆవిడ: "ఎవరో"
"ఎవరోనా..వాడి పేరేంటి? " వీడి ప్రశ్న.
"నాకు తెలీదు"
"ఎందుకు తెలీదు?",
"నేను అడగలేదు."
"ఎందుకు అడగలేదు"
......
"ఎందుకు అడగలేదు టీచర్"
"వాడెవడొ పిచ్చోడు"
"పిచ్చోడా...."
........
(కాసేపయ్యకా మళ్ళీ వాడే అడిగాట్ట)"పిచ్చోడంటే?....పిచ్చోడంటే ఏంటి?"
.....
(వాడు మళ్ళి అడిగాట్ట)"పిచ్చోడంటే ఏంటి టీచర్?" (మా వాడి నస మొలయ్యింది అంటే ఇక ఆగదు కదా)
.....
"ఆ పిచ్చోడి పేరేంటి టీచర్".This was heights. (ఈ సారి తిక్కరేగినట్టుంది ఆవిడకి).
"నాకు తెలీదు"
"ఎందుకు తెలీదు టీచర్?" (ఒళ్ళు మండినట్టుంది)
"కాసేపు మాట్లాడకుండా కూర్చుంటావా?"
........
కొంచం గాప్ ఇచ్చి అడిగాట్ట,అమాయకంగా. "మాట్లాడకుండా కూర్చుంటే, అప్పుడు తెలుస్తుందా ???"
(ఈసారి నిజంగానే కళ్ళు 'భళ్ళ్'అని పేలాయి కాబోలు. )
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(3) స్కూల్లో ఆటలకని sand pit, water pit, balls room లాంటివేవో ముందున్న ఖాళీస్థలంలో ఆడిస్తూంటారు. మావాడికి కార్ల పిచ్చి. దాంతో 'రాను. నేను లోపలే ఆడుకుంటా' అన్నాట్ట. ఆయమ్మ అడిగిందిటమీ ఫ్రెండ్స్ అందరూ ఆడుకుంటున్నారు, నువ్వెందుకు రావు అంటే, "సూర్య భగవానుడు స్ట్రా పెట్టి తలలో ఉన్నందంతా తాగెస్తాడు". (సన్ ఫీస్ట్ సాఫ్ట్ డ్రింక్ యాడ్ లో చూపిస్తారు స్ట్రాపెట్టి పిల్లల్లో ఉన్న అంతా తీసేస్తున్నట్టు. ) ఆయమ్మకి పగటి పూటే చుక్కలు కనిపించాయిట.

ఒరోర్నీ దుంపతెగ అన్నట్టుంటాయి వాడి తో ప్రతిదీ ను.

Saturday, July 25, 2009

భాగవతానికీ- గాయత్రికీ సమన్వయం ఏమిటి?

భాగవతానికీ గాయత్రి కీ గల సంబందం ఏమిటి ? మత్స్యపురాణం ఏమిటి ? అందులో చెప్పిన గాయత్రికీ భాగవతకథ కీ సమన్వయం ఎమిటి? ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, పురంజనోపాఖ్యానం లాంటి ఎన్నో కథలుంటే వృత్రాసుర వధనే పోతనామాత్యుడు అవతారిక వంటి పద్యం లో ఎందుకు ఉదహరించాడు? భాగవతానికి దేనిని ప్రమాణంగా స్వీకరించి పోతన ధర్మాన్ని వివరించాడు?

ఈ ప్రశ్నలర్ధంకావాలంటే భాగవత కథా ప్రారంభాన్ని చూడాలి. ముందుగా పద్యమూ, వచనమూ.

సీ. విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని
వలననేర్పడు ననువర్తనమున
వ్యావర్తనమున, కార్యములందభిజ్ఞుడై
తానరాజగుచు జిత్తమున జేసి,
వేదంబులజునకున్ విదితముల్ గావించె
నెవ్వడు, బుధులు మోహింతురెవ్వ
నికి, నెండమావుల నీళ్లకాచాదులు
నన్యోన్యబుధ్ధి దా నడరునట్లు

ఆ. త్రిగుణ సృష్టియందుదీపించి సత్యము
భంగిదోచు, స్వప్రభా నిరస్త
కుహకుడెవ్వ డతని గోరి చింతించెద
ననఘు సత్యు పరుని అనుదినంబు.

: ఇట్లు "సత్యం పరం ధీమహి" అను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మస్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రినధికరించి ధర్మ విస్తారంబును, వృత్రాసుర వధంబును, ఎందుజెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి ఈ పురాణంబు శ్రీ మహాభాగవతం బన నొప్పుచుండు.

భాగవత కథకి ఇది మొట్టమొదటి పద్యం. ఒక విధంగా చెప్పాలంటే భాగవతహృదయం కూడాను. పోతనామాత్యుడు భాగవత కథాప్రారంభాన్ని "విశ్వజన్మస్థితి విలయంబు" పద్యం తో మొదలెట్టి గాయత్రినీ, మత్స్యపురాణాన్ని, వృత్రాసురవధనీ ప్రస్తావిస్తూ "ఇవన్నీ ఎందులో చెప్పారో దాన్ని భాగవతం అంటారు కాబట్టి, దీనికి భాగవతం అనే పేరు" అన్నాడు. మొత్తం భాగవత రహస్యాన్ని, దాని ఆత్మనూ ఒక్క వచనం లో గుప్పించేశాడు అంతే కాదు ఈ ముందు చెప్పినవన్నీ ఉన్నదాన్ని భాగవతం అంటారు అని ఇంకొక రహస్యాన్ని విప్పాడు.

పద్యం సులభంగానే అర్థమయ్యేట్టు ఉంది కాబట్టి వచనాన్ని పరిశీలిస్తే..

" ఈవిధంగా 'అన్నిటికన్నా ఉత్తమమైన సత్యమును ధ్యానము చేయుదుము' అని ప్రారంభింపబడిన మత్స్య పురాణం లో గాయత్రి అను పేర సర్వాంతర్యామియైన భగవంతుణ్ణి వివరించటం జరిగింది. దానిని ప్రమాణంగా స్వీకరించి ధర్మాన్ని వివరించటం, వృత్రాసురవధ వివరింపబడ్డాయి.దానిని భాగవతం అన్నారు, ఈ పురాణంలో కూడా అదే వివరింపబడుతోంది కాబట్టి భాగవతం అని పేరు పెట్టారు." అని.

ఇక్కడ గాయత్రి అంటే ఏమిటీ? మంత్రం కాదు. అందు ప్రతిపాదింపబడిన సత్య దర్శనం. "ఎవడు మనబుధ్ధులను ప్రేరేపించుచున్నాడో, ఆదేవుని వెలుగును ధ్యానింతుము గాక" అన్నది గాయత్రి లో ప్రతిపాదింపబడిన సత్యం. "యావేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీమహేశ్వరీ" అని మహన్యాసం లో ఉన్నదీ, "నగాయత్ర్యా: పరం మంత్రం, న మాతు:పరదైవతం" అని ఆర్యోక్తి ఉన్నదీ ఎందుకు అంటే, అన్నిటికన్నా ఉన్నతం అయిన సత్యాన్ని ప్రతిష్ఠ జేస్తోంది గనక. బుధ్ధిని ప్రేరేపించేవెలుగు అంటే బుధ్ధికి పైననున్న వెలుగు. అంటే పంచేంద్రియాల పైన మనస్సు, మనస్సుపైన బుధ్ధి, బుధ్ధి పైన 'ఆ' వెలుగు. మన బుధ్ధులను ప్రచోదనం ఎక్కడ నుండి చేస్తున్నాడు? మనలోనుంచే. సూర్యుడిలో వెలుగుగా ఎవరున్నరు? వాడే. ఆ వెలుగు మనలోఉన్నది అని తెలియటం సులభమేగానీ మనమే అని తెలియటం సుభం కాదు. ఆ వెలుగునుండి తనకు భేదమునాపాదించుకుని జీవుడు చూస్తున్నాడు కాబట్టి సూర్యుని వెలుగు గా మనకన్న వేరుగా కనిపిస్తోంది. 'ఇతడు' అని చెప్పటానికి వీలుగా మనకన్నా వేరుగా ఉన్నాడు కనుకనే ఆదిత్యుడు అన్నారు "అసావాదిత్యోబ్రహ్మ" అని. అట్లాంటి సూర్యుడి లోనూ, మనలోనూ ఒకే వెలుగు ఉంది.

మరి గాయత్రి అను పేర భగవంతుడు సర్వాంతర్యామి ఎలా అయ్యాడు అంటే అసలు గాయత్రి అంటే గానము చేయువారిని రక్షించునది అని అర్ధం. గాయతాం త్రాయతే ఇతి గాయత్రి. జీవులను ఎలా రక్షిస్తోంది అంటే ఉచ్చ్వాస నిశ్శ్వాసల రూపం లో ప్రాణం వలే రక్షిస్తోంది. సీసపద్యం లో చెప్పినట్టు గా త్రిగుణాలతో ఉన్న సృష్టిగా కనిపిస్తూ ఉన్నా, వేర్వేరు రూపాలతో, వేర్వేరు నామాలతో జీవులందరూ ఉన్నట్టు ఉన్నా దానికి అంటకుండా దానికి అతీతం గా, అంతర్యామి అన్నిజీవులలో శ్వాస రూపం లో ఉన్నాడు. అంటే జీవులు ఒకరినొకరు చూచి సంబంధము నెలకొల్పుకొన్నప్పుడు వ్యక్తులనూ, వారి ప్రవర్తననూ కాక వారిలోనున్న వెలుగు / అంతర్యామిని దర్శించటం అన్నది ఇక్కడ "సత్యం పరం ధీమహి".

మరి మత్స్యపురాణం ఏమిటిట అంటే, సీసంలో చెప్పారుకదా, వేదాలను బ్రహ్మకు తెలియజేసాట్ట. "యావేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీమహేశ్వరీ" వేదములలో ప్రతిపాదింపబడిన గాయత్రి అన్నిటా, అంతటా వ్యాపించి ఉంది అని. అదే "సత్యం పరం ధీమహి". అంతకముందు వరకూ సృష్టి అవ్యక్తంగా ఉంది.తరువాత వ్యక్తం అయ్యిందిట. గదిలో చీకటిగా ఉన్నప్పుడు వస్తువులన్నీ ఉన్నా, ఎలా కనపడవో, సృష్టి అలా అవ్యక్తం గా ఉంది. టార్చిలైటో, దీపమో తీసుకురాగానే ఎలాగైతే ఉన్న వస్తువులన్నీ కనపడతాయో, అలా సృష్టి వ్యక్తం అయ్యిందిట. ఆ తార్చిలైటే సూర్యుడు. ఆ టార్చిలైటు లోని వెలుగే అంతర్యామి. విష్ణుమూర్తి మత్స్యావతారం లో వేదాలని సోమకుడినుండి కాపాడాడన్నట్టు చెప్తారు. ప్రళయం వచ్చినప్పుడు మత్స్య రూపమై సృష్టి ని కాపాడాడు అని అంటారు. ఏమిటిట అంటే, అవ్యక్తమంటే ప్రళయం అనీ, వ్యక్తమంటే సృష్టి అనీ, వ్యక్త పరచినవాడు సూర్యుడు/ మత్స్యమనీ, వ్యక్తమైనవి వేదాలు, లెదా వాని వెలుగులు అని సంకేతార్ధంతో అంటారు. దీనినే మత్స్యపురాణ రహస్యమంటారు.

మరి వృత్రాసురవధ ఏమిటీ అంటే, ఆ కనబడే సృష్టి అంతా త్రిగుణాలతో ఉన్నట్టు కనిపించటం మాయ కమ్ముకోవటం. ఎవరికి వారికి నేను, నాది, నావారు, నా అభిప్రాయాలూ, నా ఇష్టాఇష్టాలూ అనే పరిధి ఏర్పడి అందులోనే చక్రభ్రమణమౌతూంటుంది. త్రిగుణాల ప్రభావం చేత అందరిలోఉన్న అంతర్యామి పట్ల ఎరుక కనుమరుగై మనస్సు, ఇంద్రియాలూ, బుధ్ధీ చక్రభ్రమణం చేస్తూంటాయి. దానినే వృత్రాసురుడంటారు. ఎన్ని జన్మలు గడచినా గానుగెద్దు తిరిగినట్టే, అనుభూతి శూన్యం. దీనినుండీ తరింపు రావాలంటే ఈ మాయను దాటి సత్యాన్ని దర్శించాలి. అట్లా దర్శించు ప్రజ్ఞ ని వృత్రాసురవధ జేసిన ఇంద్రుడని అంటారు.

మరి వృత్రాసురవధకీ భాగవతానికీ సంబంధం ఏమిటీ అంటే ఈ త్రిగుణాలని దాటడం అంత సులభం కాదు. ఇంద్రియాలు, మనస్సు ఆకర్షణలకులోనై బుధ్ధి మార్గాన్ని పట్టుకోవటం, అందరిలో నున్న అంతర్యామిని గమనించుకోవటం అంత సులభం కాదు. కానీ అవే ఇంద్రియములకు మాధుర్యమునలవరచి భగవదనుభూతిని, దానికి మార్గాన్ని ఆచరణియమైన పధ్ధతిలో భాగవతుల కథల రూపంలో తెలియజేస్తే జీవులు సహజం గా ఆకర్షితులై తన్మయత్వమంది, క్రమం గా త్రిగుణాలకు అటితమైన ఆనందానుభూతిని పొందగలరు గనుక, అన్నిటికన్నా శ్రేయోదాయకమైన మార్గం భాగవతం అని పోతన విశ్వసించి భాగవత కథను మధురానుభూతిప్రదం గా చెప్పాడు

మూలం: శ్రీ కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు రచించిన శ్రీమద్భాగవత రహస్యప్రకాశం.

స్ఫూర్తి:
చతుర్విధ కందం గురించి భైరవభట్ల కామేశ్వరరావు గారు పద్యం.నెట్ లో అడిగినప్పుడు పద్యం రాస్తున్నప్పుడు మొదలై, టీకా తాత్పర్యాలతో టి.టి.డి వాళ్ళ భాగవతం పుస్తకాలు లభ్యమౌతున్నాయి అని చెప్పినప్పుడు మొలకెత్తి, సత్యనారాయణ గారు గాయత్రీ మంత్రం గురించి రాసిన టపా తో చిగురులెత్తి, ఇదిగో ఇలా రూపుగట్టుకుంది.

Coming Next:

'పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టువద్దకు చేరి ' అని చందమామలో కథలున్నట్టు ఏ పురాణం విన్నా, ఏ వ్రతం విన్నా, ఏ నోముచూసినా 'సూతుణ్ణి శౌనకాది మహర్షులిట్లడిగిరి ' అనే ప్రారంభం ఔతుంది. ఏమిటి దాని వెనక ఉన్న కథా కమామిషు.. ??

ఇవి, ఇలానే మరెన్నో... రాబోయే టపాలో...

అప్పటిదాకా చూస్తూనే ఉండండి మీకు నచ్చిన ఏవో కొన్ని బ్లాగులు.

Saturday, July 18, 2009

మా ఇంటి బుడుగోపాఖ్యానం ..

శనివారం వస్తే ఏదో ఒక పుస్తకాన్ని ముందేసుకు కాలక్షేపం చేయటం నాకున్న దురలవాట్లలో ఒకటి. (మిగిలిన రోజుల్లో హడావుడి పరుగులే కదా..)
నా మటుక్కు నేను ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటే, మా ఆవిడ మావాడితో కుస్తీలు పడుతూ ఉంటుంది. ఏదో పాటలూ, పద్యాలూ గట్రా నేర్పిద్దాం అని. మధ్య మధ్యలో నాకు రెండు తగిలిస్తూంటుంది, వాడిచ్చే సమాధానాలకి. వెధవకి రెండేళ్ళు కూడాలేవు షోకులూ, టెక్కులూ తక్కువేం లేదు.

ఇంతకీ ఇవ్వాళ మా శ్రీమతీ వాళ్ళ చెల్లయి లండన్ నుంచి వచ్చింది. చూసి రెండేల్లైపోయింది కదా అని వాడితోనే రెండ్రోజులు గడపాలని మా ఇంటికి వచ్చింది.
ఆ అమ్మాయి అదృష్టం కొద్దీ పిల్లవాడికి పద్యాలు నేర్పిస్తున్నప్పుడు వచ్చింది. వాణ్ణి పిన్నిదగ్గర నేర్చుకో అని చెప్పి మా ఆవిడ వంటిట్లోకెళ్ళింది ఫలహారాలకనుకుంట. మా వాడేమైనా శ్రధ్దగా కూర్చుని పాఠాలు నేర్చుకుంటున్నాడా అంటే, , చెవుల్లో ఇయర్ ఫోను పెట్టుకుని ఎంపి3 ప్లేయర్ తో, కళ్ళజోడుతో హాయి గా సోఫాలో కాళ్ళు ఇరగదన్ని ఠీవీగా పడుకుని ఉన్నాడు.

వస్తూనే అంది, "మీవాణ్ణి మరీ తలకెక్కించుకుంటున్నారేమొనేవ్.." అని... చురుక్కు మని వీపు మీద ఏదో చిన్న మంటలా అనిపిస్తే తలతిప్పి చూసా.. వంటింట్లోంచి మా ఆవిడ చూపులు అవి, (నా నిర్వాకమే అన్నట్టు). నేనూర్కుంటానా.. స్నానానికని పైన వేసుకున్న తువ్వాలు భుజం మార్చుకున్నా...సింపులూ...

"ఏం పద్యం నేర్చుకుంటున్నావ్ రా..." అడిగింది

మావాడు నాలానే ఏదో ధ్యాస లో ఉన్నవాడి లా అన్నడు "టమేవ మాటా" (ట అన్నడు త అనకుండా) ముందు అర్ధం కాలే ఆ అమ్మయి కి , తర్వాత అర్ధం అయ్యింది త్వమేవ మాతాచ అని.

"సరే చెప్తే నేర్చుకుంటావా? వేషాలు వేస్తావా?" అడిగింది..."ఊ " అని బుర్ర ఊపాడు. మొదలెట్టింది చిన్న చిన్న పదాలతో నేర్పించటం ..వాడూ పరధ్యానం లో ఉన్నట్టుగానే ఉంటూనే చెప్ప్తున్నాడు.

అప్పుడు జరిగిందీ సంగతి. నేర్పిస్తున్న పద్యం మధ్యలో వాడికి బోల్డన్ని ప్రశ్నలొస్తూంటాయి. అది తీరితే కానీ నడక ముందుకు సాగదు. (అదేదో వ్యాసుడూ, గణపతీ ఒప్పందం చేసుకున్నట్టు.. అర్ధం అయితే తప్ప ముందు కి బండి సాగనివ్వడు మావాడు... నాకూ అది అప్పుడే అర్ధం అయ్యిందనుకోండి.) మా ఆవిడ నాకు టిఫిను అందిస్తూంటే వాడు ఆ అమ్మాయిని అడిగాడు "ద్రవిణం" అంటే ఏమిటి అని. ముందు మా ఆవిడ, ఆతర్వత నేనూ ఆల్మోస్టు ఒకేసారి ఖంగు తిన్నాం (ఒక్క లిప్త కాలం ఒకర్నొకరు హాస్చర్యం గా చూసుకున్నాం కదా..)

నేను బుర్రతిప్పకపోయినా చెవులు రిక్కించి వింటున్నా.. రియాక్షన్ ఎలా ఉంటుందా అని. కొంచం ఇరకాటం గానే అనిపించింది కాబోలు ఆ అమ్మాయికి "ఏమిరా.. నీకు ద్రవిణం కావాల్సి వచ్చిందే.. ఆకాటికి మిగిలినవన్నీ తెలిసిపోయినట్టె.. దాని మీనింగు తెలుసేమిట్రా అంది."

వాడు ఠక్కున ఎత్తుకున్నాడు అదే పరధ్యానం తో "నీవే టల్లివి టండ్రివి నీవేనా టోడు నీడ నీవే సఖుడౌ, నీవే గురుడవు దైవము నీవే నా పటియు గటియు నిజముగ కిత్నా"

ఈ సారి అవాక్కవడం ఆ అమ్మాయి వంతయ్యింది, నవ్వుకోవడం మావంతూనూ. మా వాడీకీ ఏదో అర్ధమైనట్టే ఉందనుకుంట, కొంటె గా నవ్వేసాడు.

వాళ్ల అమ్మ నేర్పించిన అదేదో పద్యానికీ దీనికీ లింకు ఎలా పెట్టగలిగాడు అన్నది మాకు ఇప్పటికీ మిలియన్ డాలరు ప్రశ్నే..
అప్పుడప్పుడు డౌటొస్తూంటుంది ముళ్ళపూడి గారి బుడుగు దారి తప్పి మా ఇంట్లోకి గానీ వచ్చేశాడేమో అని...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇది జరిగి 8-9 నెలలుథోంది....పాతఫొటో లు ఎదో దులుపుతూంటే స్మృతిపథం లో ఈ సంఘటన బయటపడింది.

Friday, July 17, 2009

కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల భాగవత రహస్య ప్రకాశం!

రమణ గారి కోర్కెమీద ఈ క్రింది వివరం ఇక్కడ పొందుపరుస్తున్నా.

పెద్దలు, పండితులూ అయిన శ్రీ దివాకర్ల వెంకటావధాని గారు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రాసిన భాగవత రహస్య ప్రకాశాన్ని చదివి, తన కంటే పిన్న వయస్కులైన ఎక్కిరాల వారిని గురించి, భాగవత రహస్య ప్రకాశాన్ని సభా ముఖం గా ప్రస్తుతిస్తూ.. "వ్యాసుడే తాను వ్రాసిన భాగవతాన్ని పండిత పామరులకు సులభం గా అర్ధమయ్యేట్టుగా ఎక్కిరాల వారి వాగ్రూపం లో రహస్య ప్రకాశం చేశారు. పోతన భాగవతానికి వివరణతో వారిచ్చిన అనుభవైకవేద్యమైన కోణాలు పండితులకు కూడా కనువిప్పు కలిగించేట్టు గా ఉన్నాయి. పిన్నవయసువారైనా, వారికి మనస్ఫూర్తి గా నమస్కరిస్తున్నాను ' అని వినమ్రం గా మాట్లాడారు. అటువంటి కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రాసిన భాగవత రహస్య ప్రకాశంలోని కొన్ని ఆణిముత్యాల వంటి వాటిని వీలును బట్టీ అందు ఈ బ్లాగు ద్వారా పరిచయం చేయటానికి ప్రయత్నిస్తా..

కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు రాసిన భాగవత రహస్య ప్రకాశం(పద్యమూ, టీక, తాత్పర్యము తో కూడిన రహస్య ప్రకాశ వివరణతో) అత్యంత రమణీయం గా పునర్ముద్రణం జరిగి ఇప్పుడు వివిధ 'జగద్గురు పీఠం ' శాఖలలో లభిస్తున్నాయి. ఈ క్రిందివారికి టపా ద్వారా, లేదా ఫోను ద్వార సంప్రదించి భాగవతం సెట్ పొందవచ్చు.

satyadev.ch@gmail.com/ sripathi.sanath@gmail.com,

హైదరాబాదు --> జె. శ్రీధర్ --> 9348465600 హైదరాబాదు --> సనత్ కుమార్ --> 9908611411 బెంగుళూరు --> మురళి మోహన్--> 9902009700 విశాఖపట్నం --> శ్రీ కె.శివ శంకర్ గారు --> 9912899266 విజయవాడ --> శ్రీ వి.ఎస్. కృష్ణమూర్తి గారు--> 99893 11846 గుంటూరు --> శ్రీ జి. ఎల్.ఎన్. శాస్త్రి గారు --> 92474 15934 రాజమండ్రి --> శ్రీ. ఎన్.ఎస్. శర్మ గారు --> 94406 87509 మంగళగిరి --> శ్రీ ఆర్.టి. రామారావు గారు --> 9848632658 మైసూరు -->శ్రీ ఎం.ఎస్. గణేష్ గారు --> 93417 75225 చెన్నై --> శ్రీ రాంప్రసాద్ జోషి గారు --> 9003020654 బళ్ళారి --> శ్రీ. జె.ఎన్.మూర్తి గారు --> 97402 77255

పోతన భాగవత ప్రియులకు, పుస్తక ప్రియులకు తాజా వార్త !!

పుస్తక ప్రియులకు తాజా వార్త !! పోతన భాగవత ప్రియులకు సంతోషకరమైన వార్త !! తెలుగు భాషాభిమానుల పాలిటి కామధేను వార్త. !!

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మరి కొందరితొ కలిసి అనువదించిన తెలుగు తాత్పర్యం తొ కూడిన పోతన భాగవతాన్ని టి.టి.డి. వాళ్ళు 5 సంపుటాలుగా ప్రచురించారు. హైదరాబాదు హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో ప్రస్తుతం పుస్తక ప్రదర్శన జరుగుతున్నది. అందులో భాగం గా సరసమైన ధరకే లభిస్తోంది. ఆదివారం వరకే ఈ అవకాశం. పద్యాలు+తాత్పర్యమూ ఉన్న ఈ పుస్తకం ధర 500 రూ.మాత్రమే.
ఔత్సాహికులకు సువర్ణావకాశం వినియోగించుకోగలరు.

Saturday, July 11, 2009

రాముడూ - స్ఫూర్తి -10 - పళ్ళు.



తీయనైన పండ్లు తినిపించ వలెనంచు
తపన జెంది, శబరి తనివి తీర
అడవి లోన వెదికి అరుదైన ఫలరాశి
నేరి తెచ్చి రాము నెదురు జూచె !!


ఎదురు చూపు లోనె ఏళ్ళెన్నొ గడవగా
ఫలములన్ని మిగుల పండ సాగె !
జవములన్ని యుడి
గి చరమాంకమును జేర
ఎండి పోవుచున్న ఎదను జూచి,


'అమ్మ' లేని మాకు అమ్మైన, నాన్నైన
నీవె గాదె దిక్కు నీరజాక్షా ??
ఈ ఉపేక్ష లేల, నీకింతమరుపేల?
అవని పౌత్రులన్న అలుక లేల?


అనుచు తల్చి, దుఃఖ మతిశయించగ, పండ్లు
నతులొనర్చి, రాము నడుగ సాగె
"ఎండి పోయె జన్మ మింకిపోయెను ఆశ !
వైరి కైన ఇట్టి బ్రతుకు వలదు !


"ఏ తప మాచరించినను, ఎన్ని వ్రతమ్ములు చేసియున్ననున్ !
ఏ తరి పూల 'బూచినను ', ఎన్ని దినమ్ములు వేచియున్ననున్ !
మా తల రాత మారదొకొ ! మమ్ము భుజించుట కిచ్చ
గించవో !
ఈ తపనంతయు
న్నిసుక నింకిన తైలమొ ! శాప గ్రస్తమో !! "


అనుచు మనసు లోని ఆక్రోశమును తెల్ప
గుండె లోని బరువు కొంత తీరె.
నీటి లోని అలలు నెమ్మదించిన రీతి
కుదురుకున్న మనసు కుదుట చెందె.


మనసు లోని చింత మటుమాయ మవ్వగ
ఫలము పలికె మధుర
వాక్కు లిట్లు
"ఏ సహాయమిత్తు మే రీతి సేవింతు
మెరుక పరచవోయి ఇనకులేశా !


ఎట్టి దేశమైన, ఏకాలమైననూ
అధిక శక్తి
నొసగు అమృత ఫలము
స్వీకరింపుమయ్య శ్రీరామ చంద్రుడా !
ఎండు ఖర్జురమ్ము, ఎండుద్రాక్ష !!

కం
ఎండిన ఫలముల బ్రతుకుల
పండుగ దినమొచ్చునట్లు వరమిటు లిడుమా!
పండిత పామర రంజక !
దండములివె ! స్వీకరించి దండిగ తినుమా !"


పండ్ల హృదయ కుహరమవలోకనము జేయ
విశదమయ్యె పూర్ణ విమల భక్తి
అందు వలన రాముడాఢ్యుడై 'డ్రై ఫ్రూట్సు'
*
నారగించి, మొరల నాలకించె !


స్ఫూర్తి:
(1) మొత్తం భావాన్ని పద్య రూపం లో ఇద్దామన్న ప్రయత్నం 'రామా ఆర్త రక్షామణీ' పద్యాలని చదువుతున్నప్పుడు తట్టిన ఆలోచన.
(2) రాముడూ thanks giving అనుకుంటున్నప్పుడు, శబరి ఆశ్రమం లో పళ్ళూ గుట్టలు గుట్టలు పడి ఉంటాయి అని ముందు పద్యం లో భావన వచ్చింది. వాటికి మానసం ఉంటే రాముడి తో ఏమని మొర పెట్టుకునేవో కదా అని ఆలొచన వచ్చినప్పుదు కలిగిన భావన 'డ్రై ఫ్రూట్సు' అని.

Wednesday, June 17, 2009

రాముడూ - స్ఫూర్తి -9 - కోతులు

ఏ రోజుకారోజు శబరి అనుకునేదిట- రాముడు ఈరోజు వస్తాడేమో, ఎన్నింటికి వస్తాడో, ఎంత ఆకలితో వస్తాడో ఏమో అని ప్రతి రోజూ రాముడి కోసం అడవంతా తిరిగి, నేలపై రాలి ఉన్న పళ్ళను ఏరుకుని వచ్చేది. ఏ పళ్ళు తియ్యగా ఉన్నాయి , ఏ పళ్ళు పుల్లగా ఉన్నాయి అని చూసి సిద్ధంగా ఉంచేది. రాత్రి వరకూ చూసి పడుకునే ముందు ఇంక రేపు వస్తాడేమొ అనుకుంటూ నిరీక్షణతోనే కాలం వెళ్ళబుచ్చేది. తెల్లారిన తర్వాత మళ్ళీ అదే పని..అడవంతా తిరిగటం, నేలపై రాలి ఉన్న పళ్ళను ఏరుకుని రావటం...

అయితే రాముడి కోసం తెచ్చిన పళ్ళు గుట్టలు గుట్టలు గా ఆశ్రమం లో పడి ఉండేవి కదా వాటితో అడవిలో జంతుజాలానికి యమ సంబడంగా ఉండేదిట. ముఖ్యం గా కోతులకి. కష్టపడి అడవంతా తిరిగి చెట్లమ్మటా పుట్లమ్మటా వెతుక్కుని తినక్కర్లేదు కదా అని కోతులు, చిలుకలూ, మిగిలిన పక్షులూ ఆ పళ్ళ గుట్ట ల దగ్గరే కాపురం ఉండేవిట. రాముడి కోసం తెచ్చిన పళ్ళు మీరెందుకు తింటున్నారు అని ఆవిడ అడిగేది కాదు. తల్లి కదా... పిల్లలు కడుపు నిండా తింటే సంతోషించేది.

అలా ఆశ్రమం లో కాలక్షేపం చేస్తున్నప్పుడు రాముడి గురించి శబరి అనుక్షణం తలచుకునేవన్నీ వినేవారుట. ముసలావిడ కదా.. వార్ధక్యం.. అందునా ఒంటరి గా ఎదురుచూసేది. తనలో తాను మాట్లాడుకోవటం.. చుట్టూ చేరిన జంతు జాలంతో మాట్లాడడం .. దీనితో వాళ్లకి కూడా రాముడి తో పరోక్ష బంధం ఏర్పడి పోయిందిట... ఎంతగా అంటే.. వీళ్ళందరూ కూడా ఆవిడకి మల్లే రాముడి కోసం ఎదురుచూడటం...రాముడే ధ్యాస, రాముడే ధ్యానం గా అయిపోయారుట. అందుకే ఆవిడ కూడా రాముడితో నీ కోసం నిరీక్షణ చేస్తూ, నీకై తపించే వానరులున్నారు. అలా ముందుకి వెళితే తారస పడతారు వారు నీకు సహాయపడతారు అని చెప్పిందిట. (recommendation....)

అయితే అలా అప్పనంగా తిన్న పళ్ళ కు కృతజ్ఞతగా ముసలావిడ మర్నాడు అడవికి వెళ్ళేప్పటి కి పళ్ళు పండినాయో లెదో చెట్టు మీదే రుచి చూసి చెప్పేవిట చిలుకలు. చెట్లన్నిటిపై గెంతి పండిన పళ్ళు నేలరాలేట్టుగా చేసేవిట కోతులు.

ఇంతకీ ఆ అలవాటు తోనే అప్పటి నుండీ ఇప్పటి దాక కూడా కోతులు చెట్లపై కుప్పిగంతులు వేస్తూనే ఉన్నాయి....చిలుకలు రామచిలుకలై జామ పళ్ళను చిలక్కొట్టుడు కొడుతూనే ఉన్నాయి...

(శబరి 'రామా రామా ' అని ప్రతీ దానికీ తలచుకోవటం చూసి చిలుకలు కూడా 'రామా రమా ' అనటం నేర్చుకుని రామచిలుకలు అయ్యాయి. ఆవిడ రుచి చూసి పెట్టటం చూసి అవీ అలానే చేస్తున్నాయి)

పలుకు పలుకులందు పలుమారు దలపోసి
చిలుక లాయె రామ చిలుక లట్లు.
అనుకరించు నేర్పు అలవాటు గా నయ్యి
పక్షి జూడ సాగె పండ్ల రుచులు.

'తిన్న ఇంటి ఋణము' తీర్చుకొనగనెంచి
కోతులెగుర సాగె కొమ్మలందు
పండ్ల కొరకు వెదుకు పనిలేని రీతిలో
సాయపడిరి గాదె శబరికిట్లు.

స్ఫూర్తి:
యాదగిరిగుట్టలోనూ, అన్నవరంలోనూ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. బహుశా అందుకే నేమో అక్కడ ఎప్పుడూ బోలెడన్ని కోతులు ఉంటూంటాయి. దర్శనం కోసం మేము వరుసలలో నిలబడి ఉన్నప్పుడు కోతులు కుప్పిగంతులు వేస్తూ చెట్లనీ, కొయ్య స్తంభాలనీ కుదిపేస్తూ వీరంగం వేస్తూంటే తట్టిన ఆలోచన.

Sunday, April 12, 2009

రాముడూ - స్ఫూర్తి -8- జల చరాలు.

రాముడితో రాళ్ళు ఇట్లా సంభాషిస్తున్నప్పుడు ఆ రాళ్ల క్రింద నున్న సముద్రం నుండీ ఇంకొన్ని గొంతులు వినిపించాయిట.

"రామా నువ్వు సర్వ సుగుణ రాశివనీ, గుణ శ్రేష్ఠుడవనీ, యావత్ ప్రపంచం, నీకు తోచిన రీతి లో సేవ చేసుకుంటున్నారనీ తెలిసి, మేమూ మాకు చేతనీన సహాయం చేసి తరిద్దాం అని ఆత్రం గా ఎదురు చూస్తూంటే నీ స్నేహితుడొచ్చాడని గుహుని పడవ ఎక్కి వెళ్ళిపోతావా స్వామీ !! మేమేం అన్యాం చేసాం స్వామీ !! అప్పుడంటే సీతమ్మవారు కూడా ఉంది. పోనీ లే అని సర్దుకు పోయాం. కనీసం రెండవ సారైనా వారధి నిర్మించే సమయంలోనైనా నీ పాద స్పర్స దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాం. మమ్మల్ని మాత్రం వద్దనుకున్నవా తండ్రీ !! నిన్ను అర్చించుకునేందుకు మేము మాత్రం అర్హులము కాదా ! మా జన్మకి చరితార్ధకత లేదా !! అని అడుగుతున్నాయిట నీటి లోని జల చరాలు.

రాముడన్నట్ట "అరెరే ! పాపం వీళ్ళు కూడా ఎంత నొచ్చుకుని ఉంటారో కదా !! అస్సలు గమనిక లో లేకపోయిందే !! వీరి మనోభీష్ఠాన్ని తీర్చవలసిందే" అని కృత నిశ్చయుడయ్యట్ట.

అందుకేం కృష్ణావతారం లో మొట్టమొదట చేసిన పని - వాళ్ళ మధ్యకి వెళ్ళి పోయాట్ట. కామర్సు భాష లో చెప్పలంటే ఏదైతే carry forward అవుతుందో అదే brought forward గా కనిపిస్తూంటుంది కదా !! అలా . అందుకే మొట్ట మొదట గా ఈ పని అయిపోవాల్సిందే అని యమున వద్దకి వెళ్ళాట్ట.

యమున, అందులోని జలచరాలూ ఆనందంతో "పొంగి పోయాయి ట". అదీ - యమున పొంగిపోవటం వెనుక ఉన్న అసలు కథ. లేక పోతే ఎంతో మంది మహర్షులు, యాదవులు వేసుకున్న పథకం మారిపోయి నీటి మధ్య నుండీ కృష్ణుడు రావటానికి బలమైన కారణం వేరే ఏమిటీ కనబడటం లేదు. కంసుడి మృత్యువు దేవకీ దేవి అష్టమ గర్బ్భం గా రాబోతున్నదని పలికిన అశరీర వాణి ఆ పరంధాముడే వస్తూంటే, ఆ మాత్రం అయినా చెప్పక పోదా.. ఏర్పాటు చేయకపోదా. ఆకస్మికం గా (సాప్ట్వేర్ భాషలో చెప్పాలంటే) dynamic గా ప్లాను / పథకం మార్చేయటానికి బలమైన కారణం ఇంతకన్న ఏమయ్యుంటుందంటారు?

కన్గొన లేని బాధ కడ కన్నులు నింపగ పల్కె "నావలో
నిన్గొని పోయిరొక్కపరి, నీటను వారధి గట్టి రాపయిన్
నిన్గను కోర్కె తీరదొకొ ! నీ దయ రాదొకొ ! నీవు నీటిలో
మున్గిన వారి గోడు విని మోక్ష మొసంగగ వేగ రావొకో "!

స్ఫూర్తి: భద్రాచలం లో వరదలు ప్రతీ ఏడూ వస్తూంటాయనీ, అవి వచ్చినప్పుడు ఈ మేర వరద నీరు చేరుతుంది అని స్థానికులు రాముల వారి కోవెల ప్రాకారం గోడల పై నీటీ చారలు చూపించినప్పుడు కలిగిన భావన. బహుశా గోదావరి లో జల చరాలన్నీ కనీసం ఏడాదికొక్కసారైన రాముల వారు నడయాడిన ప్రదేశం మనసారా ముద్దాడి తిరునాళ్ళు చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతూంటాయేమో...

Tuesday, April 7, 2009

పచ్చనైన చెట్టు పద్యమయ్యె! - రామాయణం

భైరవ భట్ల కామేశ్వర రావు గారు http://www.padyam.net లో పద్యం తో కసరత్తు లో పచ్చనైన చెట్టు పద్యమయ్యె అని మొదటి సమస్య ని పూరణ కు ఇచ్చారు. ముందు ఒక పద్యం రాసా..

తేట తెనుగు గాలి తెమ్మెరలు 'గద్యాలు',
స్వాంత 'వచన' విరులు, స్వాగతింప,
సేద దీర్చి అతిథి సత్కార ములుసేయు
పచ్చనైన చెట్టు 'పద్య ' మయ్యె !!

సాహిత్య పరంగా 'గద్యం, వచనం, పద్యం ' లతో పూరణ బాగానే అనిపించింది కానీ తృప్తి కలగలేదు
రామనవమి భావాల్లో నే ఇంకా తూగుతున్నందుకో ఏమో ఆ పద్యాన్ని పూరించే ప్రయత్నం లో రామాయణ స్ఫూర్తి తో మరి రెండు భావాలు మెదిలాయి.

రామ కథల కల్ప వృక్షమ్ము నననేమి?
కాండలందు ఇక్షు ఖండ మెట్లు
అలరె? నంచు గురుడు అడుగ శిష్యుడు తెల్పె
'పచ్చనైన చెట్టు', 'పద్య మయ్యె' !!

అయినా తృప్తి చాలలేదు.

గరళ తరులు నీదు కరుణ సోకగ నెట్లు
మరలె మరల మరులు మరువలేక?
అమృత కరము నైన కర పత్రమేదయ్యె?
'పచ్చనైన చెట్టు', 'పద్య మయ్యె' !!

* గరళ తరువు = విష వృక్షం.

రామ నామ మహిమ ఎంతటిదంటే దానిని పట్టుకున్నవాడు ఎటువంటి వాడైనా వాడికి మహత్వం అబ్బాల్సిందే, రామాయణ కల్ప వృక్షాల పుస్తకాలు ఎన్ని అమ్ముడయ్యాయో విష వృక్షాలూ అన్ని అమ్ముడయ్యాయి. బాంధవమున నైన పగనైన వగనైన అన్నట్టు తిట్టుకుంటూ నైనా రామ నామాన్ని జపించాల్సిందే... తిట్టుకుంటున్నప్పుడు అక్కసు తో ఇంకొచం ఎక్కువ సార్లు అంటామేమో కూడా ... మంచో చెడో 'పట్టున్న 'విషయం లెకుండా పుస్తకాన్ని రాయడమూ వీలుకాదు, రాసినా గీసినా అది చదివేవాడూ ఉండదు. కాబట్టే 'వాణ్ణి 'పురుషుడు అన్నారేమో. దాశరధీ శతకం లో చెప్పినట్టు చెప్పాలంటే... "మ్రొక్కిన నీకె మ్రొక్క వలె, మోక్ష మొసంగిన నీవె ఈవలెన్ తక్కిన మాటలేమిటికి?" ఇప్పటి కాలానికి అనుగుణం గా చెప్పుకోవాలి అంటే మేనరిజమ్సు ఏ రజనీకాంత్ కో రామారావుకో పెడితే జనాలు నీరాజనాలు పడతారు కానీ సైడు కారెక్టరులకి పెట్టరూ, పెట్టినా అవి అంతగా పండవు. ఒక 'బిల్లా ' కావాలన్న, ఒక 'లవకుశ 'కావాలన్న.. సరైన హీరో కావాలి

మళ్ళీ అసలు విషయానికి వచ్చేస్తే, అందుకేనేమో విశ్వనాథ సత్యనారాయణ గారిని వాళ్ళ నాన్నగారు "రాస్తే గీస్తే రామాయణం రాస్తే అర్ధం పరమార్ధం గానీ కవిత్వాలు ఎన్ని రాస్తే మాత్రం ఏముందీ రా " అన్నారుట. రామాయణం ఒక నవల/ పుక్కిట పురాణం అనుకున్నా, ఆ పాత్రలూ, దానిని మలచిన విధానం... దాన్లోని కథ, అప్పటి నుండీ ఇప్పటి దాకా అలా చెప్పుకుంటూ వచ్చేలా ఊరించ గలుగుతోంది అంటే దాన్లో 'ఏదో 'ఉంది. వెతుక్కున్న వారికి వెతుక్కున్నంత. ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. ఒక కథ అందరికీ నచ్చాలనీ లేదు. అందుకే ఇంతక ముందు ఎందరో రాసిన రామాయణాన్నే మీరూ ఎందుకు రాస్తున్నారు అని అడిగితే విశ్వనాథ వారు ' ఏ జీవ లక్షణానికి సరిపోయింది ఆ జీవ లక్షణం ఉన్నవాడు చదువుకుంటాడు. ఇంతక ముందు ఎందరో తిన్న, నా ఆకలి నాది, నా రుచి నాది, నా తృప్తి నాది అన్నారు ట (నేను విన్నదె కానీ నిజమో, కాదో నాకు తెలీదు అనుకోండి). అప్పుడు రాశారుట రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని. అమోఘమైన రచన. నేను చాలా కొంచమే చదివాను కానీ చదువుతున్నంతలో ఎదో తెలియని మత్తు. సాహిత్యాన్ని, దాన్లోని రసాస్వాదన నిపూర్తి గా అర్ధం చేసుకోలేదు కూడా.

అయినా రాముడన్నా విశ్వనాథ అన్నా ఎంతో ఇష్టం కాబట్టి ఇద్దరినీ స్మరించుకుందామని ఈ టపా రాస్తున్నా..

నా రుచి నాది, నా తృప్తి నాది .

గమనిక. మీ భావాలు అందుకు విరుధ్ధం గా ఉంటే అది మీ వ్యక్తి గత స్వేచ్చ. నా భావాలే సరైనవని నేను అనటం లేదు. మీరు అనదలచుకుంటే ఇక్కడ మాత్రం దయచేసి మీ అక్కసు వ్యక్త పరచకండి. మీ మీ బ్లాగుల లో యధేచ్చ గా వ్వ్యక్త పరచుకోండి.

ఈ మాత్రం సహకరించండి.

Sunday, April 5, 2009

రాముడూ - స్ఫూర్తి -7- రాళ్ళు.

అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !!
పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం.

మోహనమైన రూపు నవమోహనమై ప్రసరించు చూపు స
మ్మోహనమైన భాషణము మోదము కూర్చు ప్రవర్తనమ్ము మ
న్మోహనమైన రీతి నగు మోమున గన్పడు రాముడా జగ
న్మోహను డెల్లకాలముల మోక్ష పథమ్మున నిల్పు గావుతన్ !!

ఆఫీసు హడావుడి తో రాముడూ స్ఫూర్తీ పై గత కొద్ది రోజుల గా రాయలేకపోయా. రాముడి దయవల్ల రెండ్రోజులు రామ నవమి చేసుకోవటం తో కొంచం సమయమూ, అనందమూ, ఉత్సాహమూ కలిసి వచ్చి మళ్ళీ ఇంకొక టపా రాస్తున్నా.

ఇక రాబోయే 4-5 టపాలూ రాముడూ - Thanks Giving పైనే ఉంటాయి. రాముడూ - స్ఫూర్తి- రాళ్ళూ, రాముడూ -స్ఫూర్తి- జల చరాలూ, రాముడూ -స్ఫూర్తి- పళ్ళూ, |మొ|

ముందు గా రాముడూ - స్ఫూర్తి- రాళ్ళూ

రాముడు తనకి సహాయ పడ్డ వారందరికీ కృతజ్ఞతా భావంతో ఆశీ:పూర్వకంగా వరాలను అనుగ్రహించాడు ట. అప్పుడే ఆ వరుసలో ఆఖరున ఉడుత ఉన్నదనీ దానిని ఏవిధం గా అనుగ్రహించాడో ఇక్కడ మనం చదువుకున్నాం.....

ఉడుత గుర్తుకురాగానే వారధీ నిర్మాణం మదిలో మెదిలిందిట రాముడికి. వారధీ నిర్మాణం లో ముఖ్య భూమిక వహించిన వారిని అందరినీ మనసులో తలచుకున్నాడుట. రాముడు ధర్మ స్వరూపుడు కదా... ఆయనకు అందరూ ఒక్కటే.అందుకే నర వానరులను ఎటువంటి భేధాభిప్రాయం లేకుండా సమానం గా చూచాడు. స్మృతి పథం లో మెదలిన కొందరు ప్రత్యేకమైన వారిని పలకరించటానికి తానే వారి వద్దకు చేరుకున్నాట్ట.

వారెవరో కారు... మన రాళ్ళు. వారధి వద్దకు చేరుకుని అడిగాడట రాళ్ళను. నీటి పై తేలియుండడమే కాక అశేష వానర సేననూ సముద్రం దాటించటానికి మీరు చేసిన సహాయం అమేయం. రామ నామ మహిమ ను చాటిన మీ భక్తి ప్రపత్తులు అమోఘం. మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడుట.

అచేతనములూ, ప్రాణ రహితములూ అనుకునే రాళ్ళ లో కూడా మనసుంటుందని భావించి రాముడు వారి మనోగతాన్ని అవలోకనం చేసుకోడానికి కళ్ళు మూసుకున్నాట్ట. నువ్వు సముద్రుడిని దారి ఇవ్వమని కోరుతూ మూడు రోజులు దీక్ష చేపట్టినప్పుడు మాత్రం మేమందరం ఎంత మనోవేదన అనుభవించామో తెలుసా.. నీ సేవ చేసే అవకాశం దొరికే ఒకే ఒక్క అదృష్టమూ చేజారిపోవలసిందేనా..అని. నీ సేవ చేయగలుగుతామో లేదో అన్న భారం తో బరువెక్కిన మా తనువులు నీ నామాన్ని ధరించే అవకాశం రావటం తో తృప్తి తో తేలికైపొయాయి... ఇది చాలు అన్నాయిట. అయితే వారిలొ చిన్ని గులక రాళ్ళు మాత్రం రాముడి వంక బుంగమూతి తో చూస్తున్నాయిట. బుంగమూతి ఎందుకుట అంటే బంధుత్వం కలుపుతున్నయిట (చిలిపి గా). పోనీ మీరు చెప్పండి అన్నాడుట రాముడు. అందరూ మనసు బండరాయి ని చేసుకుని అని వాడుతూంటారు. ఏం? బండరాయికి మాత్రం మనసుండదా..?అందరూ అసలు అలా ఎందుకు అనాలి అన్నాయిట. తేనెలొలికే పూల బాలలకు మూణ్ణాళ్ళ ఆయువువెందుకిచ్చావో నీకే ఎరుక. కాకపోతే బండరాలను చిరాయువులు గా ఎందుకు దీవించావు? చెప్పు - మా జన్మ కి సార్ధకత ఎలా? అని అడిగాయిట.

అప్పుడు అన్నాట్ట రాముడు మీ హృదయాన్ని ఆవిష్కరిస్తే అవి చాటి చెప్పే సత్యాలు, ధర్మాలూ శాశ్వతం గా నిలిచి ఉంటాయి. శిల శిల్పం అయినప్పుడు మాత్రమే చిరాయువుగా నిలిచినందుకు సార్ధకత అన్నాడుట. అప్పటి నుండీ శిలలు శిల్పాలై, విగ్రహాలై ఆలయ ప్రాకారాల్లో భగవన్మహిమ ను చాటుతూ చిరస్థాయి గా నిలిచాయిట.

చం:
తడవగ రాళ్ళు నీదు 'మరదళ్ళు'ను కాదొకొ - 'బావ' కావొకో !
పుడమిజ తోడబుట్టువుల పూజలు నోములు నీవెరుంగవో !
(జడములచేతనమ్ములని జాగొనరింపగ నెంచుచుంటివో !)
అడుగిడి జన్మ సార్ధకత నందునటుల్ శిల శిల్పమౌనటుల్
కడపటి కోర్కె తీర్చగదె ! కావగ రాగదె ! బ్రోవ రాగదే !!

స్ఫూర్తి !!
మా అమ్మగారు భద్రాచలం లో పసుపు రాయి, కుంకం రాయి, నార చీరలూ చూడడానికి అతి కష్టం మీద నడుస్తూ ఎంత అదృష్టమో కదా, రాముడు నడచిన రాళ్ళను చూస్తేనే ఇంత సంతోషం గా ఉందే, ఇక ఆయన నడిచినప్పుడు ఇవెంత ఆనందించి ఉంటాయో కదా అని అన్నప్పుడు కలిగిన భావన. రామార్పణం.

Tuesday, March 10, 2009

వ్యాసుడూ -Vs - ఆది శంకరులూ

వ్యాసుడూ -Vs - ఆది శంకరులూ - ఆమ్మవారి వర్ణన.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
అసలు విజయవాడ లో దుర్గమ్మవారి అలంకరణ లో కిటుకు ఏమిటో తెలియదు కానీ ఆవిడ నవ్వు మాత్రం బిలియన్ డాలర్ స్మైల్ కి కొన్ని వందల రెట్లు ఉన్నట్టు ఉంటుంది.

ఆదివారం అనుకొకుండా దర్శనం చాలా బాగ జరిగింది. వీలున్నత దగ్గర గా చూడచ్చు కదా అనే స్వార్ధం తో 50 రూపాయల టిక్కెట్టు తీసుకుని వెళ్ళా. క్యూ లో లలితా సహస్రనామం చదువుకుంటూ వెడుతూంటే, ఒక్కొక్క నామం వర్ణన ముమ్మూర్తులా కళ్ళ ఎదురు గా ఉన్నట్టు కనిపించింది అమ్మవారిని చూస్తూంటే. బయట కూర్చుని లలితా పారాయణ అయ్యక సౌందర్య లహరి చదువుకుంటే ఆలొచన ఒకటి మెరిసింది. భలే అనిపించింది. (ఇది ఇంతక ముందే అందరికి గమనిక కి వచ్చి ఉండచ్చు, నాకు మాత్రం ఇప్పుడే 'యురేకా 'అయ్యింది.)
కురువింద మణి శ్రెణీ కనత్కొటీర మండిత తో మొదలుపెట్టి వ్యాసుల వారు నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ, ఫదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా, శింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజా వరకూ వర్ణించారు. అంటే కురులతో మొదలు పెట్టి కాలి గోళ్ళు వరకూ అమ్మ వారి సౌందర్యం ప్రతీ అవయవాన్ని ఆవిష్కరించారు.

కళ్ళు మూసుకుని చదువుతూంటే, ఒక బొమ్మని / పటాన్ని క్రమం గా ఉన్మీలనం చేస్తున్నట్టు పై నుంచీ కింద వరకూ వర్ణన ఉంటుంది. చూడండి కావాలంటే...కురులు, విశాలమైన నుదురు, కళ్ళు, ముక్కు, ముక్కు పుడక, చెవులు, చెవులకి దుద్దులు, చెంపలు, చిరునవ్వు, చుబుకము, స్తనములూ, పాదాలూ, కాలి గోళ్ళు...

వ్యాసుల వారి వర్ణన ఇలా ఉంటే, శంకరుల వారు పాదాల నుండీ మొదలుపెడతారు.తనీయాంసం పాంసుం అని పాద రేణువుల తో మొదలు పెట్టరు.

ఒకరు ఆరోహణ క్రమం లో చెబితే ఒకరు అవరోహణ క్రమం లో చెప్పారు (అనిపించింది).

తెలిసిన వారు దీని పై ఇంకొంచం వివరణ/ సమాచారం/జ్ఞానం ఇస్తే బాగుంటుందని అనిపించి సాదరం గా వారిని ఆహ్వానిస్తున్నా.

సందర్భం వచ్చింది కాబట్టి మరో మాట. పని లో పని గా ఆమ్మ వారి పై నేను రాసుకున్న ఒక పద్యం.

నాకు సౌందర్య లహరి లో జ్ఞానం బహు తక్కువ. సౌందర్య లహరి లో ప్రతి శ్లోకానికీ బోలెడంత అంతరార్ధం ఉన్న మాట నేనూ విన్నాను. కొంచం తెలుసుకునే ప్రయత్నం చేసాను.

ఎందుకో నిన్ను కూడి ఉన్నప్పుడు సమస్త సృష్టినీ చేయగల సామర్ధ్యం కలిగినవాడౌతాడు శివుడు. నీవు లేకున్నచో వేలు కూడా కదపలేడు. బ్రహ్మ విష్ణు శివాదులచే కొలువబడే అట్టి నిన్ను కీర్తించగలుగు వాడు అకృత పుణ్యుడెత్లగును? అన్నది మిగిలిన శ్లోకాలలో అమ్మవారిని కీర్తిస్తునట్టు గా కీర్తించినట్టు అనిపించలేదు.

తప్పేనని తెలుసినా అదేదో ఫల శృతి ముందు గా చదివినట్టు అనిపించింది. (నా దృష్టి లో), అందుకే శ్లోకం లో స్ఫూర్తి మాత్రం తీసుకుని నేను రాసుకున్న వేరే పద్యం.

ముందే చెప్పేస్తున్నా... సంస్కృత శ్లోకానికీ దీనికీ ఎక్కడా సంబంధమూ/ పోలికా లేనే లేదు.


లోకమ్ముల్ సృజియింపగన్ ముడిపదార్ధంబెద్ది అవ్యక్తుకున్ !
లోకారాధ్య త్రిమూర్తి సన్నుత పదాబ్జంబెద్ది శ్రేయమ్మిడన్ !
శ్రీ కైవల్య పదంబు చేరుటకు తేజో మార్గమై వెల్గు ఆ
హ్రీంకారాసన గర్భితానల శిఖన్, కీర్తింతు వాగర్ధులన్.

ఏదో కలిపి కొట్టరా కావేటి రంగా అన్నట్టు మూలానికీ సంబంధం లేకుండా రెండు మూడు జొప్పించినట్టు అనిపించవచ్చు. నేను ప్రయత్నం చేసి జొప్పించినదెమీ లేదు. దుర్గా దేవి చీకటి లో దారి చూపే వెలుగు(to mark the light in darkness) అనీ శ్లోకం చదువుతున్నప్పుడు అప్రయత్నం గా నాకు తట్టిన భావం ఇది.

Friday, February 20, 2009

రాముడూ - స్ఫూర్తి - 6 - ఉడుత.

రామాయణం లో ఉడుత ది ఒక ప్రత్యేక స్థానం. అది మనకందరికీ తెలుసు. ఆ కథ వెనుక నాకు స్ఫురించిన ఒక భావన.

రామాయణం లో ప్రధాన ఘట్టం రావణ వధ జరిగిపోయింది. తన ధర్మ సంస్థాపనా మార్గం లో సాయం చేసిన వారందరినీ ఏం కావాలో కోరుకొమ్మన్నాడుట రాముడు. జాంబవంతుడు నీతో యుధ్దం చెయ్యాలని ఉంది అన్నాడుట. అలా ఒక్కొక్కరే వచ్చి ఏవేవో కోరుకున్నారుట.

ఆ వరుసలో ఆఖర్న ఉన్నవారిని చూసి రాముడి కళ్ళు మెరిసాయిట. తనే లేచివచ్చి పలకరించాట్ట. "పూర్వ భాషీ.." కదా... ఆ ఆప్యాయతకు అక్కడున్నవారందరూ చాలా పులకరించారుట. ఇంతకీ అక్కడున్నది మరెవరో కాదు. మన ఉడుత. నీకేం కావాలి అని అడిగాడుట.

"నను పాలింపగ నడచీ వచ్చితివా... స్వామీ !! ఏమని కోరుకుందును?

మనకి అత్యంత ఇష్టమైన వారి సాన్నిధ్యం లో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఏం తింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్న స్ఫురణ ఉండదు. అన్నీ కరిగి పోయిన స్థితి లో ఉంటామట కదా, అదీ తెలియదు నాకు కానీ ఏదో అనుభూతి మాత్రం మిగిలి ఉంది. ఇంతకపూర్వం మనం కలుసుకున్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. అందరూ మాత్రం నేను చేసిన సహాయం చిన్నదే అయినా నువ్వు ఆప్యాయంగా నా వీపు నిమిరావనీ అప్పుడు గుర్తుగా వీపుపై మూడు గీతలు పడ్డాయనీ అంటున్నారు.

నాకు మాత్రం అది నిజం కాదేమో అని అనిపిస్తోంది. నీకు అత్యంత ప్రీతి పాత్రమైన పని చేసినప్పుడు నువ్వు ఆనందాన్ని వ్యక్త పరచే విధానం ఒకటుంటుంది. "సోదర భరత సమానా" అని హృదయానికి హత్తుకుంటావు. నేను చేసినది సహాయం చిన్నదే అయినా నీకు ఆనందం కలిగించే ఉంటుంది. వీలైనంత సహాయం చేద్దాం అనుకున్న ఆ స్ఫూర్తి కి మెచ్చి నన్ను నీ ఎడమ చేతిలో తీసుకుని కుడి చేతితో హృదయానికి హత్తుకుని ఉంటావు అప్పుడే జన్మించిన శిశువుని హృదయానికి హత్తుకున్నట్టు. అప్పుడు కలిగినవే అయి ఉంటాయి ఈ గుర్తులు. నేను ఆ ఆనందానుభూతి లో ఉన్నాను కనుకనే అప్పటి సంగతులేవీ గుర్తు లేవు. దయచేసి మరొక్కమారు గాఢ ఆలింగనానుభూతిని అనుగ్రహించవా?
పరిష్వంగానుభూతి లో ఇంకొక్కసారి ఓలలాడించవా" అని అడిగిందిట ఉడుత.

ఉ!! "శ్రీరఘు రాముడే ఉడుత సేవను మెచ్చి స్పృశింప, వీపు పై

చారలు గుర్తుగా మిగిలె! జన్మతరించె !"నటంద్రు పెద్దలున్

ఆరయ నాకు తోచె పరిహారములన్ గొని కౌగలించుటే

కారణమంచు, నీవు పసికందును గుండెకు హత్తుకోవటే !!

స్ఫూర్తి:

(1) భద్రాచలం గుడి లో ఆరగింపు జరిగే సమయం లో ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉండమంటారు. అక్కడ కూర్చుని ఉన్న సమయం లో అటూ ఇటూ ఉడుతలు పరుగెడుతున్నాయి.

(2) మా నాన్న గారు ప్రతీ రోజు తన భోజనం లో మొదటి ముద్ద గోడమీద పెట్టినప్పుడు రోజూ ఒక ఉడుత వచ్చి తినేది. దాదాపు 5-6 నెలలు నేను గమనించాను. ప్రతీ రోజూ నాన్నగారి ముద్ద కోసం అది ఎదురు చూసేది. ఎంత హడావుడి లో ఉన్నా నాన్నగారు దానికి ఏదో ఒకటి పెట్టి కానీ బయటకి బయల్దేవారే కారు.

అలా గుడి లో ఉడుతల ను చూడగానే ఇంటి దగ్గర జరిగే సంఘటన, నాన్నగారు కళ్ళ ముందు ఆడారు, కళ్ళు చెమ్మగిల్లాయి. మనసు ఆనందం తో నిండగానే గుడి తలుపులు తీసారు.

రామ దర్శనం చేసుకుంటున్నపుడు కలిగిన భావన.

ఇంతకీ చెప్పనే లేదు కదూ !! మా నాన్న గారి పేరు శ్రిపతి రఘు రామ కుమార్. 'శ్రీ రఘు రాముడే' అని మొదలుపెట్టటం యాదృచ్చికమే .

Monday, February 16, 2009

ప్రహ్లాదుడు-ప్రోజెక్టు మేనేజిమెంటు

తెలుగు పద్యం లో ఉప్పు కప్పురంబు పద్యానికి ఒక చక్కని వివరణనిచ్చి భైరవభట్ల వారు ఒక కొత్త భావ స్ఫూర్తి నింపారు.

మంచి భావం మల్లె పొద పై ఆరవేసిన వేసిన ఉత్తరీయం లాంటిది. కప్పి ఉంచినంత సేపూ గాలి తెంపరలకి పరిమళం వ్యాపిస్తూనే ఉంటుంది. తీసి వేసిన తర్వాత కూడా గుప్పు మని గుబాళిస్తూనే ఉంటుంది. 'రుచి ' అన్నది వ్యాఖ్యో, రహస్య ప్రకాశమో తెలియదు కానీ గమ్మత్తు గా బాగున్నది. ఏమిటొ…. పద్యం లో సరైన సమయానికి సరైన పదం పడితే వచ్చే కిక్కు లాంటిది నాకూ వచ్చింది (కిక్కెక్కింది). అది అంతా ఆయన బ్లాగు లో రాస్తే అప్రస్తుత ప్రసంగం ఔతుంది అని మన మూస ధోరణి (రాముడూ-స్ఫూర్తి, కృష్ణుడూ-స్ఫూర్తి) ల నుండి, మంచి పద్యమూ- స్ఫూర్తి కి గేరు మారుస్తున్నా..

'చూడ చూడ 'ని వివరిస్తూ భైరవభట్ల వారు భలే విషయాన్ని ఎత్తుకున్నారనిపించింది. తెలియని విషయం ఎవరైనా చెప్పినా ఒక్కోసారి నా మూర్ఖత్వానిదే పైచేయి ఔతుంది కాబట్టి అది నిజమని నమ్మలేను అని తర్కం గొంతెత్తి అరుస్తున్నా మనసు మాత్రం ఎగిరి గంతేసింది. లింకుల లంకెలు దొరికనట్టనిపించింది. ఎందుకంటే అప్రయత్నం గా నాకు ప్రహ్లాద స్తుతి గుర్తుకు వచ్చింది.

ఇందుగల డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు 'వెదకి చూచిన ' అందందే గలడు దానవాగ్రణీ వింటే అన్నాట్ట ప్రహ్లాదుడు. అక్కడ ' చూడ చూడ ' కీ ఇక్కడ 'వెదకి చూచుటకీ ' లింకు ఏర్పడింది.

సాఫ్ట్వేర్లో ప్రోజెక్టు మనేజిమెంటు వెలగబెడుతూ, ప్రోజెక్టు మనేజిమెంటు మీద క్లాసులు తీసుకుంటూ, ప్రహ్లాద చరిత్ర కీ సాఫ్ట్వెర్ కీ లంకె దొరికే సరికి తబ్బుబ్బైపోయి ఇక్కడ ప్రసంగిచ్చేస్తున్నా. సాఫ్ట్వేర్తో, లేక ప్రోజెక్టు మనేజిమెంటు తో సంబంధం లేని వారికి కొంచం సోది గా అనిపించ వచ్చేమో, చదువరులు నన్ను క్షమించాలి. అవసరానికి మించి విషయాన్ని సాగదీస్తూ చెప్తున్నా కొత్త బిచ్చ్గాడు పొద్దెరుగడు అన్న సామెత ను గుర్తించి మన్నించగలరు.

ఇక విషయానికొస్తే , ప్రహ్లాదుడు సెర్చ్ క్రైటీరియా చెప్పాడు. 'వాడు' దొరకాలంటే ముందు వెతకాలి. ఆ తర్వాత చూడాలి అన్నాడు. అప్పుడే కనిపిస్తాడు అని. ఏది కావాలో తెలియాలి, దాన్ని వెతకాలి, రెండూను.

ఎంతో చిన్న గా చిన్న పిల్లవాడి మాటల్లో చెప్పినట్టు చెప్పేశారు పోతన గారు. మన ఇంగిలీషు లో చెప్పలంటే necessary and sufficient condition అన్న మాట. సింపుల్ గా కంప్యూటర్ పరిజ్ఞానం లో చెప్పలంటే విండోస్ లో *.* తో సెర్చ్ చేస్తే కుప్పలు తెప్పలు గా రిజల్ట్సు వస్తాయి గానీ పని కాదు. దాంట్లో వేర్ కండీషన్ కూడా ఇవ్వాలి. కానీ ఇవ్వలంటే తెలియాలి కదా...అక్కడికి పెట్టాడు లింకు.

(పిడకల వేట 1 --> ప్రహ్లాదుడు నా దృస్టి లో ఒక మంచి ప్రోజెక్టు మేనేజరు. ఎవరైనా తనను ఒక సలహా గానీ ప్రశ్న గానీ అడిగితే,
(i) నీ బొంద నీకు ఇది కూడా తెలియదా అన్నట్టు ఒక పోజు పెట్టకుండా విన్నాడు.
(ii) విన్నతర్వాత సమస్య ని చిన్న చిన్న విభాగాలు గా విడగొట్టాడు. (WBS)
(iii) ప్రతీ చిన్న విభాగానికీ ప్రాతిపదిక ఏమిటో తెలియజేసాడు. (Pre Requisite)
(iv) ఆ విభాగానికి పర్యవసానం (Deliverable/ Exit Criteria) చెప్పాడు.
(v) ఆ వచ్చిన పర్యవసానం సరైనదే అని ఎలా నిర్ధారించటం అన్నది (Review) చెప్పాడు.
(vi) ఇది అంతా పధ్దతి (Process) లో చెప్పాడు.
(vii) అన్నిటికన్న ముఖ్యంగా వాడి పని వీడు చేసి పెట్టెయటం కాకుండా, తనంత తాను ఎలా చేసుకోవాలో చెప్పాడు. (Self reliance, not spoon feeding). సాప్ట్వేర్ టెర్మినాలజీ లో చెప్పాడు.

ఏమిటిట అవి అంటే

(1) ఏది కావాలి?
(2) ఎలా వెతకాలి?
(3) కావల్సిందే వెతికామనీ, వెతికినదే దొరికింది అని ఎలా నిశ్చయించాలి?

ఇవి దానిలో ఉన్న ప్రశ్నలు.

సరే. ముందు పరిధి ని నిర్ణయిద్దాం (Scope Definition చేసారు). ఎలా ఉంటాడు హరి? చెప్పు ఇవ్వళ తాడో పేడో తేల్చేద్దాం అని అడిగాడు హిరణ్యకశిపుడు. పాపం చిన్న పిల్లవాడాయె. ఆదిత్యుల్లో విష్ణువులా, నక్షత్రాల్లో చంద్రుడిలా, వేదాల్లో సామవేదం లా, పాములలో వాసుకి లా, అక్షరాల్లో అకారం లా ఉంటాడు అని ఏo చెబ్తాడు? చెప్పినా వీడికి అర్ధం ఔతుందా. Simplify చేసి నీలో నీలా ఉంటాడు, నాలో నాలా ఉంటాడు అన్నట్ట ప్రహ్లాదుడు. తిక్కరేగింది హిరణ్య కశిపుడికి. ఇక పైవన్నీ చెప్పి ఉండి ఉంటే జుట్టు పీక్కుని ఉండెవాడు. (పిడకల వేట --> 2 తెలిసిన వాడు నాకు తెలుసు కదా అని పాండిత్య ప్రకర్ష చూపించక వీలున్నంత తెలికగా పామర రంజకం చెప్పలి). కొన్నిటిని క్లిష్టంగా complicate చేస్తేనే మనసుకి హాయి గా ఉంటుంది అర్ధం కాకుండా వదిలెయ్యటానికి. ఔను. అరటి పండు ఒలిచినట్టు సులభం గా చెప్పేస్తే మహ ఇరకాటం గా నమ్మ శక్యం కానట్టు గా ఉంటుంది. బ్రహ్మ విద్య ఇంత వీజీ నా అన్నట్టు ఉంటుంది. హిరణ్య కశిపుడికి నచ్చలేదు. Scope సంగతి వదిలెయ్యి. ఎక్కడుంటాడో చెప్పు. డైరెక్టు గా ఎటాకిచ్చేద్దాం అన్నాట్ట. ఇక్కడా అక్కడా అని లేదు ఎక్కడైనా ఉంటాదు అన్నాట్ట ప్రహ్లాదుడు. మళ్ళీ తిక్క రేగింది.

సరైన దారిలో వెళ్ళే వాడయితే ‘జ్యోతి సె జ్యొతి జలావో’ అన్నట్టు ప్రశ్న నుంచి ప్రశ్న కి అనుసంధానం చేసుకుంటూ ముందు కెళ్ళే వాడు. ఫరీక్షిత్తు వెళ్ళలే..? అలానె. కానీ హిరణ్యకశిపుడు కూడా కొంచం ఇప్పటి వాళ్ళ టైపు. ఆట్టే టైం వేస్టు వద్దు. పాయింటుకొచ్చేద్దాం అనుకుంటూంటాడు. (preparation లేదు, analysis లేదు. Result oriented).

పాపం ప్రహ్లాదుడు మాత్రం ఏం చేస్తాడు? ‘వాడిని’ వివరించాలంటే వాడికంటూ ఏమీ లేదుట. వాడు అవ్యక్తుడు. నిరాకారుడు. వేదాలు కూడా వాడిని - ఆ పురుషుణ్ణి పూర్తి గా స్తుతించి చివర్లో లక్ష్మీ దేవి భర్త అయినవాడెవడొ వాడు అన్నర్ట. ఎర్ర చీర కట్టుకున్నావిడ నా భార్య అన్నట్టు. (నవ్వొచ్చేట్టు గా ఉన్నా ఇది సత్యం. వాళ్ళు అలానే అన్నారు. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని) వాళ్ళూ మాత్రం ఎం చెస్తారు? వాడిని డిఫైన్ చేయటానికి ఏ ప్రొపర్టీ (లక్షణం) వాడినా అది ఆవిడదే కానీ వాడివంటూ ఏమీ లెవుట. నల్లని వాడు అంటే శరీర చాయ = నలుపు అనే ప్రొపర్టీ ఉన్నవాడు అనీ అన్నట్టు. అందుకే కదా సౌందర్య లహరి లో "నిన్ను పెట్టుబడి గా పెట్టి శివుడు ఈ జగాన్ని మొత్తం నడుపుతున్నాడు. నువ్వే లేకపోతె ఏదీ చెయ్యలేడు అని" శంకరాచార్యుల వారు అన్నది.

సరే ఇది కూడా తేలేలా లేదు. నీకు కనిపిస్తున్నాడా? ఏది నువ్వు చూపించు అన్నాడు. హిరణ్యకశిపుడు. Activity- Role-Responsibility- తెలియకుండా. తీరా కనిపించాక ఏం చెయ్యాలి? పిలిచి భోంచెయ్యలా? మందీ మార్బలాన్ని పిలవాలా? ఒక్కడే వెళ్ళలా? అన్నది ఏమీ ఆలోచించలేదు. కనీసం మామూలు మనిషి గా లేడు, స్తంభం లోనుంచీ వచ్చాడు. అసలు ఇక్కడెలా ఉన్నాడు అని root cause analysis లేదు.పోనీ హిరణ్యాక్షుడి విషయం లో జరిగినది అయినా గుర్తుండాలి కదా (Historical data/ pattern/ analysis). అదీ లేదు.

ఎవరికైనా భూమ్యాకర్షణ అర్ధం కావాలంటే ముందు అయస్కాంతాన్ని, ఇనుప ముక్కల మధ్య సంబంధాన్ని చూపించి ఆతర్వాత అదే సిధాంతం భూమి కి కూడా పనిచేస్తోంది అని చెబితే అర్ధం ఔతుంది. కానీ హిరణ్య కశిపుడు నాకు 10 వ తరగతి లెక్కల్ని డైరెక్టు గా చెప్పు అని అడిగాడు. (పిడకల వేట--> 3 ఈ మధ్య యాడ్ లో హాల్ల్స్ పిప్పరమెంటు ఎంత చల్లగా ఉంటుంది అని ప్రశ్న కి విమానం లో నుంచీ తల బయటకి పెట్టి చూపించినట్టు చూపించాలి). అదే చేసాడు ప్రహ్లదుడు.

ఇంతలో ఆవేశం తో స్తంభాన్ని చీల్చాడు హిరణ్య కశిపుడు. లోపల నుండీ, ఒక వింత రూపం తో విష్ణుమూర్తి వచ్చాట్ట. అప్పటికైనా మనం వెతుకుతున్నదీ, ఇదీ ఒకటెనా అని తన్ను తాను ప్రశ్నించుకోలేదు.(Verification) వీడేనా ఆ శ్రిహరి అని పక్కనున్న కొడుకును అడగలేదు. (Velidation). హిరణ్య కశిపుడు మాత్రం ఊగిపోయాడు. బ్రహ్మని అడిగి వరాలతో Risk Mitigation చేసేశాను అనే అనుకున్నాడు. కానీ ఇక్కడ అది fail అయ్యింది, వెంటనే ఏం చెయ్యాలి అని ఆలోచించ లేదు. ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో చూసుకోకుండా మీద పడ్డాడు. (crisis management) లేదు.

గుడ్డ లో మంచి గంధం మూత కడితే మంచి గంధం వాసన వస్తుంది. మల్లె పూలు కడితే మల్లె పూల వాసన్ వస్తుంది. ఇంగువ కడితే ఇంగువ వాసన వస్తుంది. నిప్పు కణిక కడితే?? ఇది అదైపోతుంది. తెలుసుకుందాం తెలుసుకుందాం అనుకుంటూ వీడు వాడిలో ఐక్యం అయిపోయాట్ట. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే..
నృసింహావతారాన్ని చూడంగానే ప్రహ్లాదుడు కిందా మీదా పడి పోలేదు ట. అదెమిటి? అంత ఉగ్ర రూపం, ఎవ్వరూ ఊహించనట్టు గా వస్తే చిన్న పిల్లవాడు భయపడి పోలేదా అంటే వాడు Risk Management చేసాడు. (Expect the most Unexpected). స్తుతించాట్ట.

ఇప్పుడు కధా వస్తువు ని మొత్తం తీసేసి (అంటే హిరణ్య కశిపుడినీ, ప్రహ్లాదుడినీ పక్కకి పెట్టేసి) జరిగినదీ , జరగుండాల్సినదీ చూడండి. తప్పొప్పుల పట్టిక తయారౌతుంది. అదే Lessons learnt.

Project Management లో Scope తో మొదలెట్టి Analysis, Design, Testing, Quality Management, Risk Management, Communication Management, Project Closure తో సహా అన్నివిభాగాలనూ స్పృశిస్తూ వివరించాడు. దారి చూపించాడు. కాలక్షేపానికి అడగటం కాకుండా ఆర్తి తో అడిగితే బోధ పడే విద్య ఏమిటొ రుచి చూపించాడు.

భగవంతుణ్ణి తెలుసుకుందాం అన్న ఒక చిన్న ప్రోజెక్టు లో హిరణ్య కశిపుడికి అడుగడుగునా తప్పులే.

భగవంతుడు ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? ఎలా గుర్తించాలి? ఎలా నిర్ధారించాలి? వెతకటానికి మనం వెళ్తున్న దారి సరైనదేనా? అలా అని నమ్మకమేమిటి? ఎందుకు వెతుకుతున్నాం? దొరికిన తర్వాత ఏం చెద్దాం? ఇవి పరి ప్రశ్న లు. హరి ఎక్కడ అన్న ప్రశ్న కి. ప్రహ్లాదుడు దానికి దారి చూపించాడు. తద్విధ్ధి: ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని.

చేసున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు ఎవరైతే ఈ అంతరార్ధాన్ని తెలుసుకున్నారో వారికి చిక్కింది వాడి లీల. అర్ధం చేసుకోక ఆయాసపడ్డాడు హిరణ్య కశిపుడు.

కధని ఇలా నిష్పాక్షికం గా విశ్లేషిస్తే, ఐ.ఐ.ఎం లలో,హార్వర్డ్ ల లో వీటినే కేసు స్టడిలంటారు, ఎక్కడైనా కేసు స్టడిలు ఇలానే చేస్తారు. జరిగిన సంఘటనల లో నుంచీ, వ్యక్తుల అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు, పరిస్థితులకు అనుగుణం గా తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావం వల్ల కలిగిన మార్పు, అది ఏ విధం గా సిధ్దాంతీకంచవచ్చు అని సమాలోచన చేసి పాఠ్యాంశాలు గా నిర్ణయిస్తారు.

ఇంతటి మహోన్నతమైన బాధ్యతని పిల్లలు బడికి వెళ్ళే వయసు రాక ముందే అప్రకటితం గా అలవరచే వారు తల్లి దండ్రులు చిన్న పిల్లలకు నీతి కధలు వినిపిస్తున్నట్టు గా.

అనాది గా వస్తున్న ఇటువంటి మన సాంప్రదాయం ఇంకా కొనసాగాలంటె, పోగో, పవర్ రేంజర్ ల ధాటి లో కొట్టుకు పోకుండా నిలబడాలంటె, మనం ముందు వాటిని సరైన దృక్పధం తో అర్ధం చేసుకోవాలి, ఇప్పటి వారి ధోరణి కి అప్పటి విషయాలను నూత్న రీతిన చెప్పగలగాలి.

"నేను సైతం విశ్వ వీణకు తంత్రినై.." ఆ దిశ గా నేను వేసిన తొలి ఆడుగు ఇది. చిన్ని ప్రయత్నం.
పెదరాయుడు సినిమాలో గ్రామర్ లో తప్పులుంటే మన్నించు. అసలు భావమే తప్పనుకుంటే క్షమించు అని...అన్నట్టు.
తప్పులుంటె మన్నించి సరిజేయండి. బోరు కొట్టుంటే క్షమించండి.

ఈ దిశ గా 'బుధ్ధి ప్రచోదన 'మవ్వటానికి కారణ భూతులైన భైరవభట్ల వారికి నమస్సుమాంజలి.
ఓపిక తో చదివిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

మీ
శ్రీపతి సనత్ కుమార్

భైరవభట్ల వారూ !! సందర్భోచితంగా సవితృ మండలాంతర్వర్తి తో గ్రీటింగ్... ఇది మీకే...